* లోకేష్ VS హరీష్ రావు సవాల్
* సముద్రంలోకి పోయే నీళ్ళు వాడుకుంటామన్న లోకేష్
‘ కాళేశ్వరానికి అనుమతులపై ప్రశ్నించిన ఏపీ మంత్రి
* ఎలా కడతావో చూస్తామని హరీష్ సవాల్
* కాళేశ్వరానికి అన్ని పర్మిషన్ ఉన్నాయ్
* రేవంత్ చేతగానితనమే అని హరీష్ ఫైర్
బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతకంతకూ ముదురుతోంది. ఈ ప్రాజెక్ట్ కడితే తప్పేంటని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రశ్నించగా, దానికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దిగువ రాష్ట్రం నీళ్ళు మళ్ళించుకుంటే తప్పేంటి… అసలు కాళేశ్వరం కట్టినప్పుడు అనుమతులు ఉన్నాయా అని లోకేష్ ప్రశ్నించారు. దానికి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బనక చర్ల కట్టి తీరుతాం: లోకేష్
బనకచర్లపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. దాన్నో రాజకీయ అంశంగా వాడుకుంటున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం.. సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే వివాదం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే, ఎగువ రాష్ట్రానికి నష్టమేంటని లోకేష్ వాదించారు. సముద్రంలో వృథాగా పోయే 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించింది. ఇది కృష్ణా నది నీటిపై ఆధారపడదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ లీడర్లు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరితమని లోకేష్ విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు త్వరలో శంకుస్థాపన జరుగుతుందని, దాన్ని స్పీడ్ గా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ ధీమాగా చెప్పారు.
బనకచర్ల అడ్డుకొని తీరుతాం: హరీష్ సవాల్
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి నోరు మూసుకుపోవడం వల్లే చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైందని విమర్శించారు. లోపాయికారి ఒప్పందంతో ప్రాజెక్టు కోసం రేవంత్ సహకరిస్తున్నారని హరీష్ ఆరోపించారు. ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతామని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడారు. అధికారం, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటని హరీష్ అన్నారు. మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్‌ను వెనక్కి తిప్పి పంపాయని ఆయన ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్ల్యూసీ, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డీపీఆర్‌ను తిరస్కరించాయని నిలదీశారు. “మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొక్క కొట్టుడో, చిల్లు కొట్టుడో ఉండదు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.
పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తు ఊరుకుంటామా…. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నోళ్లం. కాళేశ్వరంకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. మీకు వివరాలు పంపిస్తా చూసుకోండి. అనుమతులు లేవు అని ఎలా అంటావు.” అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదనరి లోకేష్ అంటున్నడు. ఈ విషయం మీ నాన్నని అడగండి అని హరీష్‌రావు సూచించారు. “ఒక్క కాళేశ్వరం వ్యతిరేకిస్తూ మీ నాన్న ఏడు ఉత్తరాలు రాశారు. మీరేమో వ్యతిరేకించలేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇచ్చిన అనుమతులు నిలిపి వేయండి, ప్రాజెక్టులు ఆపండి అని లేఖలు రాశారు. కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహితలో అంతర్భాగం, అందుకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదు అని స్పష్టంగా కేంద్రం పేర్కొన్నది. అని హరీష్ రావు వివరించారు. కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకున్నామని గుర్తు చేశారు హరీష్‌రావు.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : ఉపఎన్నికలపై కేసీఆర్ నజర్
Read also : రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్
Read also : గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్