బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు తమ ప్రత్యర్థులను దెబ్బతీసే శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఈ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వివాదాన్ని ఉపయోగించి నాయకులు తమ రాజకీయ అజెండాను నడిపిస్తూ, జనంలో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహం
రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును తెలంగాణకు నష్టమనీ, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించుకుపోడానికే బనకచర్ల కడుతున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఆనాటి ఏపీ సీఎం జగన్‌తో 2017, 2019లో రహస్య ఒప్పందాలు చేశారని, అది తెలంగాణకు ద్రోహమని రేవంత్ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ గతంలో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినా, ఇప్పుడు వ్యతిరేకిస్తోందని, దీన్ని బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిగా రేవంత్ విమర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టును టెక్నికల్‌గా, రాజకీయంగా, చట్టపరంగా అడ్డుకుంటామని సీఎం ప్రకటించారు. ఇదే సమయంలో, బీజేపీ కూడా తెలంగాణ వ్యతిరేకమని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రాకు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంతో కేసీఆర్‌ను ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆంధ్రలో చంద్రబాబు పొలిటికల్ గేమ్
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రాయలసీమ అభివృద్ధికి కీలకమని చెబుతున్నారు. గత జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, జగన్ రాయలసీమ ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎంను రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తూ, తాను రాయలసీమ రక్షకుడిగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్పీడప్ చేస్తుందని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
రాజకీయ సెంటిమెంట్‌గా బనకచర్ల
బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రేకెత్తించే రాజకీయ ఆయుధంగా మారింది. రేవంత్, చంద్రబాబు ఈ వివాదాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను దెబ్బతీస్తూ, పాలనా వైఫల్యాలపై చర్చ రాకుండా అజెండాను నియంత్రిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల సీఎంలు తమ రాజకీయ ప్రతిష్ఠను పెంచుకుంటూ, ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టివేస్తున్నట్టు కనిపిస్తోంది.
Also read: విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000
Also read: 93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!