ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థులు బీఆర్ఎస్‌కి రాజకీయానికి రామబాణంలా ఉండేవాళ్లు. 2014లో ప్రత్యేక తెలంగాణ సాధనకు నిరుద్యోగులు, యువకులు గుండె ధైర్యం చేసి పోరాడారు. కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వాళ్లను పట్టించుకోలేదు. ఫలితం? గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త తరం యువతను ఆకర్షించాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం స్వయంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే కొత్త ప్లాన్స్ రచిస్తున్నారు… బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎందుకు సడెన్ గా యూత్ గుర్తుకొచ్చారు..
బీఆర్ఎస్ ఎక్కడ తడబడింది?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యువతను నిర్లక్ష్యం చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీక్‌లు, ఉద్యోగ నోటిఫికేషన్‌లు సరిగ్గా రాకపోవడం లాంటి ఫెయిల్యూర్స్‌తో నిరుద్యోగులు బీఆర్ఎస్‌పై తిరగబడ్డారు. యువత ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోకుండా పెద్ద లీడర్లను ఎక్కువగా నమ్మింది. కానీ ఆ లీడర్లలో చాలామంది కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగుల ఓట్లు బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా టర్న్ అవ్వడంతో కాంగ్రెస్ చిన్న మార్జిన్‌తో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ “ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు” అని హామీ ఇచ్చి యువతను ఆకర్షించింది.
బీఆర్ఎస్ కు యువత ఎందుకు ?
ఇప్పుడు బీఆర్ఎస్‌కి అర్థమైంది, అధికారంలోకి రావాలంటే యువత ఓట్లు కీలకమని. అందుకే విద్యార్థులు, యువతను టార్గెట్ చేసి కొత్త వ్యూహం రెడీ చేస్తోంది. కేసీఆర్ ఎర్రవల్లిలో ముఖ్య నేతలతో సమావేశాలు జరిపి, జిల్లా కేంద్రాల్లో విద్యార్థి సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, కేసీఆర్ కృషి, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్ట్ వంటి అంశాలను యువతకు చెప్పాలని నిర్ణయించారు. ఆగస్టు 1 నుంచి మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, కరీంనగర్ వంటి జిల్లాల్లో సమావేశాలు పెట్టి యువతను ఆకర్షించాలని చూస్తున్నారు.
కాంగ్రెస్‌ని ఎదుర్కోవడంపై ప్లాన్
కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని, పాలనలో ఫెయిల్ అయిందని యువతకు చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఉదాహరణకు, కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాజీవ్ యువ వికాసం ఫైల్ మూలన పడేశారు..బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ గందరగోళంలో ఉంది… ఇలాంటి అంశాలను హైలైట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కరీంనగర్‌లో ఆగస్టు 8న బీసీ సభ నిర్వహించి కాంగ్రెస్‌ని ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతను యాక్టివ్‌గా ఇన్వాల్వ్ చేసి, బీఆర్ఎస్‌ని బలోపేతం చేయాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ గత తప్పిదాల నుంచి లెసన్ నేర్చుకుని, యువతను టార్గెట్ చేస్తోంది. కానీ కాంగ్రెస్ కూడా యువతను పట్టించుకుంటుందా…తన దగ్గరున్న జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, కొలువుల నోటిఫికేషన్లు అస్త్రాలు బయటకు తీస్తుందా… స్థానిక సంస్థల లోపు… కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన కొన్ని హామీలైనా నెరవేర్చాలి… లేకపోతే ఘోరంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య యువత ఓట్ల కోసం పోటీ హోరాహోరీగా సాగుతుంది. బీఆర్ఎస్ తన ఉద్యమ గతాన్ని, కేసీఆర్ కృషిని యువతకు చెబుతూనే కాంగ్రెస్ హామీలను బొంకుతుందని ఎత్తిచూపాలని చూస్తోంది. కేసీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? యువత మళ్లీ బీఆర్ఎస్‌ని నమ్మతుందా ? చూడాలి.
Read also : ట్రంప్-మోడీకి ఎక్కడ చెడింది?
Read also : గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్
Read also : అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?