ఆ మధ్య 2 యేళ్ళ క్రితం… KBC (Kaun banega crorepati) Show మాంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు… వాడెవడో ఢిల్లీకి చెందిన కంత్రీగాడు ఒక వీడియో పెట్టాడు. KBC లో కోట్లు గెలుచుకున్నా… ఇంట్లో డబ్బులు చూడండి ఎలా ఉన్నాయో… అంటూ కట్టల కట్టలు చూపించాడు. పైగా ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ తో వాడికి KBC లో డబ్బులు వచ్చినట్టు బైట్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్… సోనీ నెట్ వర్క్ వాళ్ళు లైన్లోకి వచ్చి… అది ఫేక్ అని తేల్చేశారు.
ఇది కూడా చదవండి : Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !
Digital Arrest పేరుతో వేల కోట్ల దోపిడీ !
అప్పట్లో మొదలైన ఫేక్ వీడియోలు, లింకుల యవ్వారం ఇప్పుడు వేల కోట్ల రూపాయిలు దోచుకునేదాకా వెళ్ళింది. సెకనుకు 11 సైబర్ బెదిరింపులు వస్తున్నాయి. ఏడాది కాలంలో 36 కోట్ల మాల్ వేర్లతో దాడులు చేశారు సైబర్ నేరగాళ్ళు. వేల కోట్ల రూపాయలు సామాన్యుల కష్టాన్ని అప్పనంగా దోచేశారు. ఇప్పటికీ… మీ పేరున విదేశాలకు డ్రగ్స్ పార్శిల్స్ వెళ్ళాయి… మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇంకొందరిని KYC Update పేరుతో, మరికొందరిని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు… ఇలా ప్రతి రోజూ లక్షల కాల్స్ చేస్తున్నారు. వేల కోట్లు దోచేస్తున్నారు.
ఫేక్ రీల్స్ తో బురిడీ !
ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లో లాభాలు అంటూ ఫేక్ రీల్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ ట్రేడింగ్ సంస్థలు, బ్యాంకుల లోగోలు వాడుకుంటూ నకిలీ యాప్స్ ద్వారా దోచుకుంటున్నారు. ఇంట్లోనే కూర్చొని రోజుకి వేలల్లో సంపాదించే అవకాశం… డీమాట్ ఖాతా… స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు… స్టాక్స్ ట్రేడింగ్ చేయొచ్చు… మేం చెప్పిన స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే… వారంలో లక్షాధికారులు అవుతారు… నెలలో కోటీశ్వరులు అవుతారు అంటూ రీల్స్ చేసి ఇన్ స్టా, యూట్యూబ్స్ లో పోస్ట్ చేస్తున్నారు. లింక్ బయోలో ఉందని మభ్యపెడుతున్నారు. చాలామంది అది నిజమే అనుకొని సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి కోట్లు నష్టపోతున్నారు. జనానికి నమ్మకం కలిగించేందుకు గోల్డ్ మెన్ శాక్స్, SBI, ICICI లాంటి పేరున్న సంస్థల పేర్లు, లోగోలు వాడుకుంటున్నారు ఈ కేటుగాళ్ళు.
ఇది కూడా చదవండి : Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !
ఆ యాప్స్ తో నిండా మునుగుడే !
ఫేక్ రీల్స్ చూసి ట్రేడింగ్ చేద్దామనుకొని సైబర్ క్రిమినల్స్ ను సంప్రదిస్తున్నారు కొందరు. అలాంటివాళ్ళని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్పించి… స్టాక్ ట్రేడింగ్ మీద అవగాహన కల్పిస్తున్నట్టు మొదట కొన్ని రోజులు బిల్డప్ ఇస్తున్నారు. ఆ తర్వాత మొబైల్ కు లింకులు పంపి, ప్రముఖ బ్యాంకుల లోగోలు ఉన్న APK LINKS ని డౌన్లోడ్ చేయిస్తున్నారు. ముందు కొన్ని స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చి… ఆ తర్వాత నిండా ముంచేస్తున్నారు. చాలామంది ఇలాంటి మోసగాళ్ళ గురించి తెలియక… బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ తీసుకొని ఈ ఫేక్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి… నిండా మునుగుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ లో ఓ ఐటీ ఉద్యోగితో ఇలాగే పెట్టుబడి పెట్టించి మొదట 7 లక్షల లాభం చూపించారు. ఆ తర్వాత అతనితో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయించి… ఏకంగా 2 కోట్ల 40 లక్షల రూపాయలు నొక్కేశారు.
ఇలా సోషల్ మీడియాలో ఫేక్ రీల్స్ చూసి ట్రేడింగ్ ఉచ్చులోకి దిగుతున్న వాళ్ళల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీసే ఉంటున్నారు. స్టాక్ ట్రేడింగ్ అంటే కనీసం అవగాహన లేకుండా… గుడ్డిగా సైబర్ క్రిమినల్స్ డబ్బులు పంపుతూ కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ లో ఇంత తక్కువ టైమ్ లో మన పెట్టుబడికి 100శాతం లాభాలు ఎలా వస్తాయి అని కనీసం ఆలోచించలేకపోతున్నారు.
సోషల్ మీడియాలో ట్రేడింగ్ గురించి వస్తున్న రీల్స్, షార్ట్స్ చూసి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్ పై అవగాహన లేకుండా అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దని మార్కెట్ నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.