హనుమంతుడు లేకుండా రామాయణం లేదంటారు మన పెద్దలు. అసలు ఆంజనేయుడి బలపరాక్రమాలు, స్వామి భక్తిని నిరూపించడానికే సుందరకాండను ప్రత్యేకంగా రాశారు వాల్మికి మహర్షి.
శ్రీరామదూత, నమ్మినబంటు హనుమాన్ ను స్మరిస్తే చాలు… భయం, ఆందోళన తొలగిపోతాయి. భూత ప్రేతాలు దగ్గరకు కూడా రావు అంటారు. రామ నామం పలికే ప్రతి చోటా ఆంజనేయుడు ఉంటాడు. అందుకే రామాయణం ప్రవచనం జరిగే ప్రతి చోటా, ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఓ సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. హనుమాన్ అక్కడ కూర్చుని… రాముడి కథలు, లీలలను వింటూ మైమరచి పోతాడని భక్తుల నమ్మకం. ప్రతి చైత్ర పౌర్ణమినాడు హనుమద్విజయోత్సవాన్ని నిర్వహిస్తారు.
హనుమాన్ అందరికీ ఆదర్శం
హనుమంతుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా చేసుకోవాలి. శ్రీరామచంద్రుడి ఆజ్ఞను పాలించడం కోసం అతడు సముద్రాన్ని అవలీలగా దాటేశాడు. తాను బతికిఉంటాడో… చనిపోతాడో తెలియదు. అయినా సరే నమ్మకంతో అనుకున్న పని సాధిస్తాడు. అంటే హనుమాన్ ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నాడు. ఆయన గొప్ప సూక్ష్మబుద్ధి గలవాడు కూడా… అంటే చురుకైన తెలివితేటలు గలవాడు. ప్రభువుని సేవించడం’ అనే గొప్ప ఆదర్శాన్ని ఆ మహానుభావుడు ఆచరించి చూపాడు. ఆంజనేయుడి ఆదర్శాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు అన్వయించుకోవాలి. కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గురువు విషయంలో ఎదురుచెప్పని విధేయత చూపాలి. విజయరహస్యాలు వీటిల్లోనే ఉన్నాయి. హనుమాన్ ఓవైపు దాసులలో ఉత్తముడిని అనే ఆదర్శన్నా చూపిస్తూనే మరోవైపు సింహానికి ఉండే ధైర్యాన్ని, సాహసాన్ని చూపించాడు. రాముడికి మంచి జరగాలని తన జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడ లేదు. రాముడికి సేవ చేయడం తప్ప ఇంక దేనినీ పట్టించుకోలేదు. శ్రీరాముడికి బంటుగా అతడికి మేలు కలగాలనే ఉద్దేశ్యంతో అత్యుత్తమంగా పని చేయడమే అతడు తన జీవితాశయంగా చేసుకున్నాడు.
హనుమంతుడి జయంతి ఎప్పుడు ?
ఆంజనేయుడి జయంతి విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఉత్తర భారతాన హనుమజ్జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుతారు. తమిళనాడులో మార్గశిర అమావాస్య నాడు, ఒడిశాలో మేష సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పౌర్ణమిని హనుమద్విజయోత్సవంగా నిర్వహిస్తారు. అలాగే వైశాఖ బహుళ దశమిని హనుమజ్జయంతిగా జరుపుకునే అలవాటు ఉంది. వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి మంగళవారం నాడు.. పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పండితులు చెబుతున్నారు. “పరాశర సంహితలో…. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే.. పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే.. అనే శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
హనుమద్విజయోత్సవం రోజు ఏం చేయాలి ?
ఏప్రిల్ 12న హనుమద్విజయోత్సవం రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను పఠించాలి. అలగే పండ్లు, వడమాల, అప్పాలమాల, తమలపాకుల దండను ఆంజనేయుడికి సమర్పించాలి. సింధూరంతో పూజిస్తే అనుకున్న పనులు విజయవంతం అవుతాయని పెద్దలు చెబుతున్నారు. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకూ నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం తప్పక దక్కుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు ఎందుకు ఆదర్శం ?
ఇది కూడా చదవండి : ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !