*) అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
*) బీఆర్ఎస్ అవినీతికి ఈ ప్రాజెక్టు ప్రతీక – కాంగ్రెస్
*) కాంగ్రెస్ ది రాజకీయ కుట్ర – బీఆర్ఎస్
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయినప్పటికీ.. దాని చుట్టూ మాత్రం అనేక వివాదాలు నెలకొన్నాయి. రాజకీయ పార్టీలు, నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ఇవి కారణమయ్యాయి. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి సర్కారు నిర్మించిందనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. ఇది రాజకీయ వేదికలపై చర్చకు దారి తీస్తోంది.
ఈ ఆరోపణలను నాటి బీఆర్ఎస్ మంత్రి, నేటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ అనుమతి లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం దేశంలో ఎక్కడా జరగలేదని… అలాంటి ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. దీనిపై అప్పటి కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నవారు) స్పష్టత ఇవ్వగలరని ఈటల తేల్చి చెప్పారు. కేసీఆర్ కేబినెట్ లో ఆయన ఆర్థిక మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. అందుకే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కేబినెట్‌లో చర్చించారని.. ఆమోదం పొందారని ఈటల కుండబద్దలు కొట్టారు. దీంతో, ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకత పాటించారని.. చట్టబద్ధమైన అన్ని ప్రక్రియలూ చేపట్టారని ఆయన వాదనలు సూచిస్తున్నాయి.
కొనసాగుతున్న విచారణ:
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, డిజైన్ లోపాలు, ఇతర ఆర్థిక పరమైన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి సాక్ష్యాలు సేకరించింది. కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ వంటి రాజకీయ నాయకులనూ విచారించింది. కాళేశ్వరం నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదంతో పాటు ఇతర కీలక అంశాలు ఇందులో తెలిశాయని సమాచారం.
వివాదం వల్ల ఎవరికి లాభం?
కాళేశ్వరం వివాదం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ శక్తి ప్రదర్శనలో భాగంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అవినీతికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని కాంగ్రెస్ అంటోంది. ఆ పార్టీ ఇమేజ్ ను ప్రజల్లో పోగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే టైంలో తమ పాలనలో సాధించిన గొప్ప విజయానికి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతీకగా బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. మరోవైపు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్… బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతుండటం.. కొత్త చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలు చివరికి ఎలా ముగుస్తాయో వేచి చూడాలి.
Also read: బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయం
Also read: విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000
Also read: 93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!