Karthika Snanm Karthika snan

Karthika Pournami : ఇలాంటి కార్తీక పౌర్ణమి మళ్ళీ ఇప్పట్లో రాదు !

Devotional Latest Posts

హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ కార్తీకపౌర్ణమి రోజు విష్ణువు, శివుడిని ఆరాధిస్తారు. ఈ రోజున స్నానం, పూజలు చేస్తే సర్వపాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ?

పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి నవంబర్ 15 న ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున 4.58 నుంచి 5.51 గంటల మధ్యలో పుణ్య స్నానాలు చేయాలి. ఆ తర్వాత దీపదానం చేయడం శుభప్రదం. ఉదయం 6.44 గంటల నుంచి 10.45 గంటల మధ్యలో సత్యనారయణ స్వామి వ్రతం, స్వామి వారిని పూజించడం శుభప్రదం.

కార్తీక దీపదానం

‘కేటా పతంగా! మశతాశ్చ వృక్షాః
“జలేస్థలే యే వసంతి జీవా!
దృష్ట్వా ప్రదీపం నీచజన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః’

కార్తిక పౌర్ణమి రోజున ఈ శ్లోకం చదువుకుంటూ దీపారాధన చేయాలి. పౌర్ణమి నాడు వెలిగించిన దీపపు కాంతిని చూసిన జీవులందరికీ శుభం జరగాలని కోరుకోవడమే ఈ శ్లోకం యొక్క అర్థం. దక్షిణాయనంలో వచ్చే కార్తిక మాసం ఉపాసనకు చాలా మంచిదని చెబుతారు.

కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తూ ‘దామోదరం ఆవాహయామి’ అని లేదంటే

‘త్రయంబకం ఆవాహయామి’ అని చెబుతూ శివకేశవులను ఆవాహన చేయాలి.

‘ఏకస్పర్వదానాని దీపదానం తధైకత’ అని శాస్త్రం చెబుతుంది.

అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీప దానం మరో ఎత్తు అని, దీపదానం చేయాలనుకునేవారు స్వయంగా వత్తులను తయారు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. వరి పిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారు చేయాలి… ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పూజించి, నమస్కరించి, శైవ, వైష్ణవాలయాల్లో దానం చేయాలి. ఇలా దీప దానం చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని నమ్ముతారు. కార్తిక పౌర్ణమి నాడు సాలగ్రామం, ఉసిరి కాయలు దానం చేసినా పాపాలు నశిస్తాయని చెబుతున్నారు. ఇదే రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. ఆలయంలో లేదంటే ఇంట్లోని పూజ గదిలో, తులసి కోట ముందు అయినా ఈ వత్తులు వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు… మనం 365 రోజుల్లో ఏ రోజైనా దేవుడికి దీపం పెట్టకపోయినా ఆ దోషం పోతుందని అంటారు.  పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజ స్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలూ కలుగుతాయి. చాలా ఆలయాల్లో కార్తీక మాసం మొదటి రోజు నుంచీ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కార్తిక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు కనీసం పౌర్ణమి నాడైనా దీపం వెలిగించాలని పెద్దలు చెబుతారు. ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసినవారికి కూడా పుణ్యం దక్కుతుందని కార్తీక పురాణంలో ఉంది. దీపారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. దీపాలు వెలిగించేవాళ్లకు సాయంగా ఉన్నా… కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా అలాంటి పుణ్యమే దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజు కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని కార్తిక పురాణం చెబుతోంది.

ఈ కార్తీక పౌర్ణమి ఎంతో ప్రత్యేకత

ఈసారి నవంబర్ 15నాడు వచ్చే కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు.. కుజుడు ఒకరి రాశిలో మరొకరు ఉంటారు. అందువల్ల ఈ రోజున అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు అర్థరాత్రి గజకేసరి రాజయోగం ఏర్పడుతోందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున బుధాదిత్య రాజ్యయోగం కూడా వస్తోంది. 30 ఏళ్ల త‌ర్వాత కార్తీక పౌర్ణమి నాడు శ‌శ రాజ‌యోగం ఏర్పడుతుంది. శని 30 యేళ్ళ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలాంటి అరుదైన శుభగడియల్లో కార్తీక పౌర్ణమి రోజున మీరు కొన్ని పనులు చేసినా, దానాలు చేసినా అనేక రకాల ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.

ఈ కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన దానాలు

ఆహారం: పేదలకు అన్నదానం చేయడం చాలా ఉత్తమం.

బట్టలు: అవసరమైన వారికి బట్టలు దానం చేయొచ్చు

ఫలం: పండ్లను దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.

బెల్లం: బెల్లం దానం చేయడం వల్ల ఇంట్లోని దారిద్య్రం తొలగిపోతుంది.

కార్తిక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించిన వారికి గ్రహ, సర్ప, కాలసర్ప, కళత్ర దోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి. దీపారాధనకు దూది వత్తులు వెలిగిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అరటి, తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగిపోవడంతోపాటు పాపాలు నశిస్తాయని పెద్దలు చెబుతున్నారు. అలాగే తెలుపు గన్నేరు వత్తులను ఉపయోగిస్తే సిరిసంపదలు సమకూరుతాయి.

Tagged