కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

Latest Posts Top Stories Trending Now

*) ఉత్కంఠ రేకెత్తిస్తున్న‌ ఫార్ములా ఈ రేస్ కేసు

*) కాంగ్రెస్ ది క‌క్ష సాధింపు చ‌ర్య అంటున్న బీఆర్ఎస్

*) గులాబీ నేత‌ల వాద‌న‌లు ఖండిస్తున్న కాంగ్రెస్

ఫార్ములా ఈ రేస్ వ్య‌వ‌హారం తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పుట్టిస్తోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్ త‌ప్ప‌ద‌నే వార్త దుమారం రేపుతోంది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని, రాజకీయ కక్ష సాధింపు చ‌ర్యేన‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రోవైపు త‌మ‌ది పార‌ద‌ర్శ‌క ప్రభుత్వ‌మ‌ని.. అవినీతిని వెలికితీసేందుకు ఈ విచార‌ణ‌ల‌ని కాంగ్రెస్ చెప్తోంది. దీనిపై ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

ఫార్ములా ఈ రేస్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

లండన్‌కు చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’ తో కలిసి నాలుగేళ్ల పాటు హైద‌రాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కండ‌క్ట్ చేసేందుకు 2022 అక్టోబ‌ర్ లో అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అగ్రిమెంట్ కుద‌ర్చుకుంది. ఎఫ్‌ఈఓ, గ్రీన్‌కో గ్రూప్‌లతో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అనంత‌రం.. మొదటి రేసు 2023 ఫిబ్రవరి 11న నిర్వ‌హించారు. రెండోది 2024 ఫిబ్రవరి 10న జ‌ర‌గాల్సి ఉంది. కానీ 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో రేసును రద్దు చేసింది. ఒప్పందంలోని షరతులను స‌ర్కారు తప్పుబట్టింది. ఆర్థిక లావాదేవీల్లో అవినీతి జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి రూ. 55 కోట్లు చెల్లించారని ఈ రేస్ ను క్యాన్సిల్ చేసింది.

ఈ వ్య‌వ‌హారంలో అప్ప‌టి అధికారుల‌తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణకు పిలిచింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా కేటీఆర్ ఈ మొత్తాన్ని హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు జరపాలని ఆదేశించారని.. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమ‌తి లేకుండా ఇదంతా జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఎల‌క్ష‌న్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు, ఎన్నికల సంఘం ప‌ర్మిష‌న్ తీసుకోలేద‌నేది మ‌రో ఆరోప‌ణ‌. ఇలా స‌రైన అనుమ‌తులు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల హెచ్.ఎం.డి.ఎకు రూ. 8.06 కోట్లు అదనపు పన్నుల భారం పడిందని ఏసీబీ పేర్కొంది. దీనికి సంబంధించి కేటీఆర్ ను ఇప్ప‌టికే రెండు సార్లు ఎంక్వ‌యిరీకి పిలిచింది.

 

ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం?:

బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని దీనివ‌ల్ల కేసీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ భారీగా ల‌బ్దిపొందార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులపై విచారణ జరుపుతామని ప్రతీ వేదికపైనా చెప్పారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ పైనా, హరీశ్ రావు పైనా విమ‌ర్శ‌లు లేవ‌నెత్తారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు జారీ చేసి విచారణ జ‌రిపించింది. తాము చెప్పినట్లే పారదర్శకమైన పాలన అందిస్తున్నామని ప్రజలకు చెప్పుకునే అవకాశం దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికి క‌లుగుతోంది.

ఇదిలా ఉంటే, ఫార్ములా ఈ రేస్ లో కేసు న‌మోదు కావ‌డం బీఆర్ఎస్ శ్రేణుల‌ను నిరాశ‌లోకి నెట్టింది. ఇది కేటీఆర్ ప్రతిష్ఠకు మచ్చగా మారవచ్చు. పార్టీ కార్యకర్తలు నైతికంగా దెబ్బతింటారు. ఇలాంటి కేసులు, న్యాయస్థానాల చుట్టూ తిరగడంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, బలోపేతం చేసే వ్యూహాలకు పదునుపెట్టే సమయం ఉండదు. మానసిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా కేటీఆర్ కు, పార్టీ భవిష్యత్తుకు నష్టం కలిగించే అంశాలు.

ఈ కేసుల నుంచి బయటపడితే కేటీఆర్ కు పెద్ద ఎత్తున ప్రజల సానుభూతి లభిస్తుంది. అన్యాయంగా కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపిందన్న ప్రజల సానుభూతి కేటీఆర్ పై వెల్లువెత్తుతుంది. కాంగ్రెస్ రాజకీయ వేధింపులు అని ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేక భావజాలాన్ని రేకెత్తించవచ్చు. “జైలుకు వెళ్తా” అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఆయన లీడర్‌షిప్‌ను బలోపేతం చేయవచ్చు. ఈ కేసులో తన తప్పు లేదని ఆధారాలు చూపి బయటపడితే ఆ పోరాట పటిమ వల్ల కేటీఆర్ పటిష్టమైన నాయకుడిగా మరింత ఎదిగే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేతలు సైతం సిద్ధపడాల్సి వస్తుంది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలపై, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ఫ్యూచ‌ర్ పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

Also read: బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయం

Also read: విజయ్ దేవరకొండకు రూ.10లక్షలు – కత్తి కాంతారావు ఫ్యామిలీకి రూ.1000

Also read: 93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్

Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!

Tagged

Leave a Reply