మంగ్లీ మీద ఎందుకంత కోపం !

Latest Posts Top Stories Trending Now

మంగ్లీ… జానపద గాయని నుంచి సినిమా గాయని దాకా ఎదిగింది. ఎక్కడో ఓ మారుమూల పల్లెలో పుట్టి… జానపదం మీద అవగాహన పెంచుకొని…ఓ న్యూస్ ఛానెల్ కొలువు తర్వాత సినిమా గాయనిగా ఎదిగింది… తెలంగాణ సంస్కృతిని ఓన్ చేసుకుంది… ప్రతి బోనాల పండక్కి ఓ పాట చేసింది. శివరాత్రి నాడు ఆది యోగి దగ్గర ఓ పాట పడుతుంది….
ఓ రకంగా చెప్పాలంటే డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చిన అమ్మాయి… కానీ ఈమధ్యకాలంలో మంగ్లీ అంటే చాలామందికి కోపం పెరిగింది. నిజానికి మొన్న బర్త్ డే పార్టీలో కూడా ఎవరో ఓ వ్యక్తి ఎప్పుడు గంజాయి తీసుకున్నాడో తేలీదు… ఇక్కడ పార్టీలో పట్టుబడ్డాడు… పోలీసులకు మాత్రం బర్త్ డే పార్టీలో ఎలాంటి గంజాయ్ దొరకలేదు… విదేశీ మద్యం కూడా దొరకలేదు. పర్మిషన్ లేకుండా డీజేలు ఫుల్లు సౌండ్ తో నిర్వహించడం, మందు పార్టీకి కూడా అనుమతి తీసుకోకపోవడం మంగ్లీ చేసిన తప్పులు.

Mangli

కానీ మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో మంగ్లీ మీద ఏవేవో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. గంజాయ్ మాత్రమే కాదు… డ్రగ్స్ కూడా దొరికింది అని బ్రేకింగ్స్ వేశారు. లైవ్స్ ఇచ్చారు. సరే ఇదంతా ట్రాష్ అని పోలీసుల ప్రకటనతో తేలిపోయింది. మంగ్లీ మీద కొందరికి ఎందుకింత కోపం… గాయనిగా ఎదిగే క్రమంలో ఆమె చేసిన తప్పులేంటి? ఓసారి చూద్దాం…
మంగ్లీ ఎవరి పలుకుబడి లేకుండా స్వయంగా ఎదిగింది… కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఆమె చేసుకున్న ఖర్మే వెంటాడుతోంది. అందరి అభిమానం కూడగట్టుకున్న మంగ్లీ ఉన్నట్టుండి..అధికారంలో ఉన్న రాజ‌కీయ పార్టీలతో అంటకాగింది. తెలంగాణలో బీఆర్ఎస్… ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వకల్తా పుచ్చుకుంది. తాను చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తున్నానని మంగ్లీ అనుకోవచ్చు. నాలుగు కాదు… 40 రాళ్ళు వెనకేసుకొని ఉండొచ్చు కూడా. కానీ అదే ఆమెను జనానికి దూరం చేసింది. మంగ్లీ అభిమానించే వాళ్ళ కంటే ద్వేషించే వాళ్ళే ఎక్కువగా తయారయ్యారు. బర్త్ డే పార్టీ రోజున అప్ లోడ్ అయిన యూట్యూబ్ బ్రేకింగ్ వీడియోల కింద… మంగ్లీకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో జనం ఊగిపోయారు.

గతంలో ఏం జరిగింది ?

ఏపీలో సంగతి చూస్తే… వైఎస్ జ‌గ‌న్‌పై మంగ్లీ పాడిన పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో మంగ్లీ పాట‌ను వైసీపీ ప్రచారానికి బాగానే వాడుకుంది. జ‌గ‌న్‌తో మంగ్లీకి బాగా పరిచయం ఉంది. అందుకే వైసీపీ ప్రభుత్వం రాగానే… తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన SVBC చాన‌ల్ లో అడ్వైజర్ గా ఆమెను నియ‌మించారు. నెల‌కు లక్ష రూపాయల జీతం, ప్రొటోకాల్‌. మంగ్లీకి ఆ టైమ్ లో రాజ‌భోగాలే దక్కాయి. ఈ పోస్ట్ వచ్చిన సంగతి కూడా చాన్నాళ్ళు సీక్రెట్ గా ఉంచింది మంగ్లీ. నేను SV కాలేజీలో సంగీతం నేర్చుకున్నా… అందుకే నాకు పోస్ట్ ఇచ్చారని తర్వాత చెప్పింది. అదేమంత కరెక్ట్ గా అనిపించలేదు. జనాన్ని కన్విన్స్ చేయలేకపోయింది కూడా. ఇదే SVBC అడ్వైజర్ హోదాలో ఉన్నప్పుడు… ప్రోటోకాల్ ను అడ్డం పెట్టుకొని… కాళేశ్వరం గుడిలో ప్రైవేట్ వీడియో సాంగ్ షూట్ చేసింది. అప్పట్లో జగన్ సర్కార్ నుంచి ఆమెకు ఫుల్ సపోర్ట్ … అందుకే అలా నడిచిపోయింది. కానీ ఆమెకు కాళేశ్వరం గుడిలో షూటింగ్ కి ఎవరు సపోర్ట్ ఇచ్చారు… ఇప్పించిన వాళ్ళెవరూ అందరికీ తెలుసు. కానీ ఈ వివాదంలో ఈవోకి మాత్రం ట్రాన్స్ ఫర్ అయింది.

2024 ఎన్నిక‌లప్పుడు… టీడీపీ, జనసేన జనం నాడిని కనిపెట్టిన మంగ్లీ వైసీపీకి దూరంగా ఉంది. కానీ చంద్రబాబు కోసం పాట పాడాలని అడిగితే కూడా మంగ్లీ ఒప్పుకోలేదట. YCP, BJP, BRS పార్టీల లీడర్లకు పాటలు పాడిన మంగ్లీ టీడీపీకి మాత్రం నో చెప్పింది. ఆ త‌ర్వాత ఉన్నట్టుండి… అరసవిల్లితో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడితో క‌లిసి కనిపించింది. వైసీపీకి కొమ్ముగాసిన మంగ్లీని రామ్మోహ‌న్‌నాయుడు ఆద‌రించ‌డం ఏంట‌ని టీడీపీ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ నడిచింది.

ఇక తెలంగాణలో ప‌దేళ్ళు అధికారంలో ఉన్న BRSతో మంగ్లీ స‌న్నిహితంగా మెలిగింది. BRS పార్టీ యాక్టివిటీస్ లో కూడా పాల్గొని ఆడింది, పాడింది. BRSకి అధికారం పోగానే ఆ పార్టీకి గుడ్ బై కొట్టింది. నిజానికి మంగ్లీ రాయ‌ల‌సీమ బిడ్డ. అయినా జాన‌ప‌ద గాయ‌కురాలిగా సక్సెస్ కావాలంటే తెలంగాణ బిడ్డగా గుర్తింపు పొందాలని భావించింది. అందుకే ఆమెది రాయలసీమ అని తెలియ‌కుండా చాన్నాళ్ళు జాగ్రత్త పడిందని విమర్శలు ఉన్నాయి.

ఇప్పుడు త్రిపుర రిసార్ట్‌లో బ‌ర్త్‌డే వేడుక‌లో మంగ్లీ, ఆమె ఫ్రెండ్స్ మీద ఆరోపణలు వచ్చినా మంగ్లీకి సానుభూతి రాలేదు. సోషల్ మీడియాలో ఆమెను తిట్టిపోస్తున్నారు చాలామంది. నెటిజెన్స్ మాత్రమే కాదు… పొలిటికల్ లీడర్లు, కార్యకర్తల నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే ఎవరూ కూడా తాము ఎదిగి పైకి వచ్చిన రూట్ ని మర్చిపోకూడదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అందుకే పెద్దలు చెబుతారు. అలా కాకుండా ఉంటే… ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది… భవిష్యత్తులో అయినా ఏ పొలిటికల్ పార్టీ జోలికి పోకుండా… తన కెరీర్ ను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జనంలో, పొలిటికల్ పార్టీల్లో నెగిటివిటీ తొలగిపోతుంది.

 

 

Read also : 🌟 సంతోషంగా రిటైర్మెంట్ లైఫ్ కి బెస్ట్ స్కీమ్! 🌟

Tagged