షార్ట్ వీడియోలతో ప్రపంచాన్ని ఊపేసిన వీడియో మెసేజింగ్ యాప్ Tik Tok ఇప్పుడు అమెరికాలో కూడా మూతపడుతోంది. జనవరి 19 ( ఆదివారం) నుంచి టిక్ టాక్ సేవలు బంద్ అవుతున్నాయి. టిక్ టాక్ యాప్ యూజర్ల డేటా చైనా ప్రభుత్వానికి చేరుతుందనేది అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఆ దేశంతో తెగ తెంపులు చేసుకొని టిక్ టాక్ ను అమెరికాలోని ఏదైనా సంస్థకు అమ్మాలని US సుప్రీంకోర్టు సూచించింది. అయినా టిక్ టాక్ ఒప్పుకోకపోగా… అమెరికాలో తమ సేవలను బంద్ పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
వీడియో మెసేజింగ్ యాప్ గా ప్రపంచమంతటా కోట్ల మందిని ఆకట్టుకున్న టిక్ టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో కూడా మాయం అవుతోంది. డ్యాన్సులు, వంటలు, వార్తలు, బ్యూటీ టిప్స్, పాటలకు పెర్ఫార్మెన్స్, చాలెంజెస్ ని ప్రోత్సహిస్తూ పెట్టిన వీడియోలతో టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ గా మారింది.
చైనాకు ఫుల్లు సపోర్ట్
ట్రెండింగ్ లో ఉండే పాటలు, డ్యాన్సులతో హోరెత్తించిన ఈ టిక్ టాక్… చైనా వ్యతిరేక వీడియోలను అస్సలు చూపించేది కాదు. 1989 తియాన్మెన్ స్క్వేర్ ఉద్యమం, ఆ సందర్భంగా జరిగిన కాల్పులు, టిబిటెన్ల స్వాతంత్ర్య పోరాటం. హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం విషయంలోనూ వీడియోలు టిక్ టాక్ లో కనిపించేవి కాదు. కానీ ట్రంప్ కు మద్దతుగా #trump2020 అని Hash Tagతో వచ్చిన పోస్టులు కోట్ల సంఖ్యలో షేర్ అయ్యాయి.
Read this also : పెళ్లి సంబంధాల పేరుతో న్యూడ్ కాల్స్ ! ? బీకేర్ ఫుల్ !!
2019 నుంచి అమెరికాలో టిక్ టాక్ పై నిరసన
ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ టిక్ టాక్ అని సెన్సార్ టవర్ అంచనా వేసింది. దీనికి అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్ టాక్ తన మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కు చేరవేస్తోందని 2019లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ రిమూవ్ చేయాలని US ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అమెరికాలో చిన్నారులను బానిసలుగా మారుస్తోందనీ… వాళ్ళ చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 2020లో కొన్ని ప్రైవసీ సంస్థలు Tik Tokకి వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. ఈ పరిస్థితుల్లో డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్ ను CEOగా నియమించి అమెరికన్లను బుజ్జగించాలని ప్రయత్నించింది.
ఇండియాలో 2020లో బ్యాన్
భారత్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణలు జరిగాక జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ కూడా టిక్ టాక్ ను 2020 జూలైలో నిషేదించింది. కోవిడ్ సంక్షోభంలో నిజాలను ప్రపంచానికి వెల్లడించనందుకు… చైనాకు బుద్ధి చెప్పడానికి టిక్ టాక్ పై నిషేధాన్ని డోనాల్డ్ ట్రంప్ కూడా సమర్థించారు. నెల రోజుల్లోగా అమెరికా నుంచి TIK TOK వైదొలగాలని 2020 ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. టిక్ టాక్ ను కొనేందుకు మైక్రో సాఫ్ట్, ఒరాకిల్, వాల్ మార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. కానీ బైట్ డ్యాన్స్ మాత్రం అమ్మకానికి ఒప్పుకోలేదు.
ట్రంప్ ఉత్తర్వులు పట్టించుకోని బైడెన్
2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ టిక్ టాక్ నిషేధంపై ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టేశారు. కానీ అతి ఆహార నియమాలు లాంటి తప్పుడు సూచనలతో వీడియోలు TIK TOK లో ఉన్నాయని ప్రముఖ మ్యాగజైన్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదిక విడుదల చేసింది. అమెరికాలో ఆదరణ ఉన్న Instagramని కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్స్ జరిగిన యాప్ గా టిక్ టాక్ నిలిచింది. ఆ తర్వాత అమెరికా యూజర్ల భద్రతపై అనుమానాలు తలెత్తాయి. దాంతో అమెరికా టెక్ దిగ్గజనం ఒరాకిల్ అబ్జర్వేషన్ లో సర్వర్లకు డేటా బదిలీ చేస్తామని టిక్ టాక్ యాజమన్యాం ప్రకటించింది.
FBI ఎంక్వైరీతో టిక్ టాక్ కి చెక్
అమెరికన్ల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ Federal Bureu of Investigation (FBI) దర్యాప్తు చేపట్టింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా App Algorithumsని టిక్ టాక్ కు చెందిన మాతృ సంస్థ మార్చేస్తోందని FBI అధికారులు ఆరోపించారు. దాంతో ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ ఫోన్ల నుంచి ఈ యాప్ తీసివేయాలని వైట్ హౌస్ 2023 ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. టిక్ టాక్ CEO షూఝీ ఛెవ్ ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటల తరబడి ప్రశ్నించింది.
అమెరికాకు అమ్మాలని డిమాండ్
టిక్ టాక్ ను అమెరికన్ సంస్థకు అమ్మాలనీ లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ అమోదం పొందిన బిల్లుపై 2004 ఏప్రిల్ లో అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బైట్ డ్యాన్స్ సంస్థ కోర్టులో సవాల్ చేసింది. ఫెడరల్ అప్పీళ్ల కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ 2004 డిసెంబర్ తీర్పు చెప్పింది.
టిక్ టాక్ పై ట్రంప్ యూటర్న్
అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ తర్వాత పదవి నుంచి దిగిపోయాక మాట మార్చారు. 2014 జూన్ లో మళ్లీ TIK TOK అకౌంట్ తెరిచారు. టిక్ టాక్ ను నిషేధిస్తే Face Book కి లాభం కలుగుతుందని వాదించారు. టిక్ టాక్ నిషేధం ఉత్తర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలిపివేయాలని ట్రంప్ తరపు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమనీ… అందుకే నిషేధిస్తున్నట్టు 2025 జనవరి 17న తీర్పు చెప్పింది. మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక… మళ్ళీ TIK TOK కి అనుమతి ఇస్తారా ? కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి.
Read this also : iPhoneలో బుక్ చేస్తే బాదుడే 😢!
రెడ్ నోట్ కి డిమాండ్
అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ అవుతుండటంతో రెడ్ నోట్ కి డిమాండ్ పెరిగింది. చాలామంది షార్ట్ వీడియో మెస్సేజ్ లకు అలవాటు పడటంతో ఇప్పుడు రెడ్ నోట్ యాప్ ను అమెరికన్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ రెడ్ నోట్ యాప్ కూడా చైనాదే. టిక్ టాక్ లాగే ఇందులో కూడా చిన్నపాటి వీడియోలు చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. ఫోటోలు, మెస్సేజ్ లు పంపొచ్చు. దీనికి ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. చైనాలో Instagram, X యాప్ లను నిషేధించారు. అక్కడి ఫైర్ వాల్స్ ఈ రెండు యాప్స్ ను అడ్డుకుంటాయి. చైనాలో కూడా టిక్ టాక్ అందుబాటులో లేదు. చైనీయుల కోసం డౌయిన్ అనే మరో యాప్ ను బైట్ డ్యాన్స్ అందుబాటులో ఉంచింది.
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK