తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం (జూన్ 2న) ఉదయం 7:02 నుండి 7:20 గంటల మధ్య మిథున లగ్నంలో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. తర్వాత స్వామి వారి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారు ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలతో కలిసి బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఇది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామి స్వయంగా పరిశీలించే సంకేతంగా భావిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడలింగహోమం, గరుడప్రతిష్ఠ, రక్షాబంధనం లాంటివి నిర్వహించారు. మిథున లగ్నంలో స్వామి సమక్షంలో ధ్వజారోహణం జరగడం విశిష్టం. పురాణాల ప్రకారం, ఇతర అన్ని దానాల కంటే ధ్వజారోహణ సమయంలో గరుడారోహణం చేయడం అత్యంత పవిత్రమైన పుణ్యఫలం ఇస్తుందని చెబుతాయి. ధ్వజారోహణ లక్ష్యం 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం. ఇది సమాజ శ్రేయస్సు, వంశాభివృద్ధికి దోహదపడుతుంది.
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు టిటిడి విశేష ఏర్పాట్లు చేసింది. మూలవిరాట్ దర్శనం తోపాటు వాహన సేవలను భక్తులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఘట్టాలుగా: జూన్ 6: గరుడవాహనం, జూన్ 9: రథోత్సవం, జూన్ 10: చక్రస్నానం,
వాహనసేవల సమయంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులతో సమన్వయం చేస్తున్నారు. రైల్వేస్టేషన్, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి దగ్గర ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా భక్తులు వాహన సేవలు చూడగలుగుతారు. ఆలయం పరిసరాలను విద్యుద్దీపాలతో, పుష్పాలతో అందంగా అలంకరించారు. శ్రీవారి సేవకులను క్యూలైన్ల నిర్వహణకు నియమించారు. అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీటి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవలకు ముందు కళాకారులతో భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పెద్ద శేష వాహనం విశిష్టత
పెద్దశేషుడు ఏడుకొండలు, ఏడు లోకాలకు ప్రతీక. ఆదిశేషుడైన అతడు వాహనరూపంలో స్వామికి మంచం, పరుపు, ఛత్రం పాత్రను పోషిస్తాడు. అందువల్ల “శేషశాయి” అని పిలుస్తారు. స్వామివారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమయ్యే ఈ వాహనం, భక్తులకు శేషునిలా నిత్యసేవకులై ఉండాలని సందేశం ఇస్తుంది.