పోతూ.. పోతూ.. అణు చిచ్చు పెట్టిన బైడెన్

Latest Posts NRI Times Top Stories

అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న జో బైడెన్… పోతూ పోతూ అణు యుద్ధాన్ని రగిల్చాడు. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని రష్యాపై వాడటానికి ఉక్రెయిన్ కి అనుమతి ఇచ్చే బిల్లుపై సంతకం చేయడం, ఆ దేశం వాటిని ప్రయోగించడం చక చకా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను పరీక్షించుకుంటుండటంతో… ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నారు.

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన అధికారంలోకి వస్తే యుద్ధాలు లేకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీలు కూడా ఇచ్చాడు. దాంతో జనవరి తర్వాత అయినా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు ఆగిపోతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ ఈలోగా అణు యుద్ధం మంటను పెట్టాడు US President జో బైడెన్ (Joe Byden). వృద్యాప్యంలో ఉన్న ఆయనకు అప్పుడప్పుడు మతిమరుపు వస్తోంది. ఇప్పుడు ఏ ధిమాక్ తో ఉక్రెయిన్ (Ukrain) కి అనుమతి ఇచ్చారో తెలియట్లేదు. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని రష్యన్ భూభాగాల మీద వాడటానికి బైడెన్ అనుమతి ఇచ్చారు. బైడెన్ అలా సంతకం పెట్టారో లేదో… వెంటనే ఉక్రెయిన్ రష్యా (Russia) మీద వాటిని ప్రయోగించింది.

ఇప్పటి దాకా కీవ్… ఇకపై అణుయుద్ధమే ! (Ukrain-Russia War)

ఉక్రెయిన్ తో యుద్ధం మొదలై వెయ్యి రోజులు అయింది. రష్యా ఇప్పటిదాకా ఉక్రెయిన్ అధీనంలోని కీవ్ పై యుద్ధానికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉక్రెయిన్ దాడులతో అణ్వాయుధాల వాడకానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే అణ్వాయుధాల వాడకానికి రష్యా ప్లాన్ చేసినా… భారత్ సహా చాలా దేశాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన పనికి రష్యా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు తమ అణుకేంద్రాలను సందర్శిస్తున్నారు. అక్కడి లేజర్, సూపర్ కంప్యూటర్లు, ఇతర టెక్నాలజీని పరిశీలించారు. ఈ చర్యలతో కీవ్ లో అమెరికా, ఇటలీ ఎంబసీలను ఖాళీ చేశారు. స్పెయిన్, గ్రీస్ కూడా ఎంబసీలను మూసేస్తున్నాయి. లాంగ్ రేంజ్ క్షిపణులే కాదు… ఉక్రెయిన్ భూభాగంలో రష్యా బలగాలు రాకుండా యాంటీ పర్సనల్ మైన్స్ ఇవ్వాలని కూడా జో బైడెన్ నిర్ణయించడంతో అగ్నికి ఆహుతి తోడైంది.

బైడెన్ కి ఏమైంది ? (Why Biden allowed Ukraine to use US Made missiles)

ట్రంప్ వచ్చేలోగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మంటల్లో చలి కాచుకోవాలని బైడెన్ అనుకుంటున్నారా ? సాధారణంగా పాలన నుంచి దిగిపోయే ముందు ఇలాంటి కీలక నిర్ణయాలు ఎవరూ తీసుకోరు. వచ్చే ప్రభుత్వానికి వదిలేస్తారు. కానీ బైడెన్ అలా కాదు. ఉక్రెయిన్ కి అడ్డుగోలుగా ఆయుధాలను సప్లయి చేయడాన్ని బంద్ పెడతానని ట్రంప్ ఇప్పటికే తేల్చేశారు. నాటో అన్నా… జెలెన్ స్కీ అన్నా ట్రంప్ కి వల్లమాలిన ప్రేమ, అభిమానాలు ఏమీ లేవు. అంతేకాదు… పుతిన్ కి కొద్దో గొప్పో ట్రంప్ ఫేవర్ గా ఉంటాడన్న టాక్ కూడా ఉంది. ఇలా రోజుల కొద్దీ యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకీ నష్టమే. ఆ విషయం ట్రంప్ కి స్పష్టంగా తెలుసు. అందుకే అప్పట్లో ఆఫ్గానిస్తాన్ నుంచి సైనికులను ఉపసంహరించుకున్నారు కూడా. యుద్ధం వల్ల ఉక్రెయిన్ తో పాటు రష్యా కూడా లక్షల మంది సైనికులను కోల్పోయింది. ఆర్థికంగానూ రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కూడా ఆగిపోవాలని యూరప్ లోని జర్మనీ సహా కొన్ని దేశాలు కోరుకుంటున్నాయి. ఇదే టైమ్ లో యుద్దాన్ని తారా స్థాయికి తీసుకుపోయే బైడెన్ సర్కార్ నిర్ణయంపై అమెరికన్ల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. యుద్ధం జరక్కుండా శాంతి చర్చలు చేసి రష్యాను ఒప్పించాల్సిన ఐరోపా దేశాలు… ఇన్నాళ్ళూ తమ ఆయుధాలను పరీక్షించుకుంటున్నాయా… ప్రపంచ మార్కెట్లో తమ ఆయుధాలను అమ్ముకోడానికి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రాన్ని వాడుకుంటున్నాయా ? లేకపోతే అమెరికా సహా యూరప్ కంట్రీస్ తలుచుకుంటే ఎప్పుడో ఆగిపోయేది. అలాంటి బైడెన్ దిగిపోతూ ఇంకా అగ్గి రాజేయడం ఏంటని మిగతా దేశాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా బైడెన్ చేతులు కట్టుకొని కూర్చుంటే ట్రంప్ వచ్చాక ఆ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారని అమెరికన్లు భావిస్తున్నారు.

Tagged