హోరాహోరిగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trupm) విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేశారు. 277కు పైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించిన ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అమెరికాలో సర్వేలన్నీ కమలా హారిస్ (Kamala Haris) గెలుస్తుందనీ… ట్రంప్ ఓడిపోతాడని చెప్పాయి. కానీ వాటిని లెక్కచేయకుండా ప్రచారంలో దూకుడు ప్రదర్శించి తిరిగి విజయం సాధించారు. సంచలనాలకు కేరాఫ్ గా ఉండే ట్రంప్ కి అమెరికా ప్రజలు మరోసారి అవకాశం కల్పించారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ … అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ రకరకాల ఎత్తుగడలతో చంటీ లోకల్ అన్నట్టుగా ప్రచారం చేశారు. ప్రతికూల అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరకు విజయం సాధించారు. ఇప్పుడు కూడా కమలా హారిస్ ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేసిన ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కించుకున్నారు. కొన్ని కీలక డిబేట్స్ లో కమలా హారిస్ ట్రంప్ ని ఇబ్బంది పెట్టారు. దాంతో బైడెన్ వారసురాలిగా కమలాకి అధ్యక్ష పీఠం దక్కుతుందనీ, అమెరికా చరిత్రలోనే మొదటి ఉమెన్ ప్రెసిడెంట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ట్రంప్ ఇచ్చిన హామీలు చాలా రాష్ట్రాల్లో ఆయన గెలుపును శాసించాయి.
US Second lady మన తెలుగుమ్మాయే
భారత్ పై ట్రంప్ వైఖరేంటి ?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. దాంతో భారత్ తో అమెరికా (India, USA) వైఖరి ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది. అయితే ప్రధాని నరేంద్రమోడీతో ట్రంప్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ కూడా ట్రంప్ గెలవాలని కోరుకుందని అక్కడి విశ్లేషకులు చెబుతున్న మాట. గతంలో మోడీ – ట్రంప్ అనేక అంశాలపై కలసి పనిచేశారు. విదేశాంగమంత్రి జైశంకర్ కూడా ఎన్నికల కంటే ముందు మోడీతో ట్రంప్ కలిసి పనిచేస్తారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కి కూడా ట్రంప్ దగ్గరివాడు అని చెబుతారు. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లోనూ రష్యా తన ప్రభావం చూపించాలని ప్రయత్నించింది. అంతేకాదు… తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపివేయింస్తానని ప్రచారంలో చెప్పారు ట్రంప్. ఇటు భారత్ కోరుకుంటోంది కూడా అదే. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపించాలని కోరుకుంటోంది. ఈ విషయంలో ట్రంప్, మోడీ కలసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు… రష్యాతో మన స్నేహానికి ట్రంప్ అడ్డు చెప్పే అవకాశం కూడా ఉండదని అంటున్నారు.
పాక్, చైనాకు చుక్కలే !
పాకిస్తాన్, చైనా (Pakistan, China ) విషయంలో ట్రంప్ గతంలో లాగే కఠినంగా వ్యవహరిస్తారు. అప్పట్లో చైనా ఎగుమతులు, దిగుమతుల విషయంలో కఠినంగా వ్యవహరించారు. అలాగే ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ గోడ మీద పిల్లి వాటాన్ని కూడా ట్రంప్ ఒప్పుకోరు. ఆ దేశానికి సాయం అందించే విషయంలో గతంలో కఠిన ఆంక్షలు విధించారు. ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టించారు. ఇప్పుడు ట్రంప్ రావడం చైనా, పాకిస్తాన్ కు ఇబ్బందికరంగానే ఉంటుంది.
ట్రంప్ తో ఆ రెండు అంశాలే ఇబ్బంది
ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా – భారత్ కలసి పనిచేసే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ట్రంప్ తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే… భారత్ ఎగుమతులు, దిగుమతులపై ట్యాక్సులు పెంచే ఛాన్సుంది. అంతేకాదు.. భారతీయులకు వీసాల (US Visa, Green Card) విషయంలోనూ ట్రంప్ కాస్త కఠినంగా వ్యవహరిస్తారన్న పేరు కూడా ఉంది. లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుకుంటారు. ఈ రెండు అంశాలు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ట్రంప్ వైఖరి భారత్ కి అనుకూలంగానే ఉంటుందని అంటున్నారు.
Also Read :