వారాహి….. అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకరుగా చెప్తారు.. ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా… దశ మహా విద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన… లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అంటే….వారాహి అమ్మవారు…. లలితా దేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు గొప్ప యోధురాలిగా నిలుస్తుంది.
వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాల్లో దర్శనం…. రాత్రి వేళల్లో లేదా తెల్లవారు జామునో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. కాశీని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఆమె. ఈమెకు వారణాసిలో ఒక దేవాలయం ఉంది. ఈ గుడిలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలుండదు.
ఈ ఆలయం ఓ భూ గర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఈ గుడి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట! అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం అంతా ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి.. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి… అందువల్లే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్టు చెబుతారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పం కూడా ఉగ్ర కళ, లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది.
అమ్మను ఎందుకు ఉగ్రరూపిణిగా చూస్తున్నాం అంటే…. అమ్మవారు నరసింహస్వామి యొక్క శ్రీరూపం… అందువల్లే ఈ తల్లిని ఉగ్రమూర్తిగా కీర్తిస్తున్నాం. అలా అని అమ్మ మనకు ఎలాంటి హాని తలపెట్టదు…. ఎందుకంటే ఆమె అమ్మ కాబట్టి…. అమ్మ ఎప్పుడూ బిడ్డలని చల్లగా చూస్తూ…. వారికి ఏం కావాలో అవి ఇస్తుంది. అంతే కానీ అమ్మని చూసి భయపడకూడదు. వారాహి అమ్మవారిని మనం అమ్మగా చూసినప్పుడే…. ఆమె నుంచి శాంతి కిరణాలు మనల్ని తాకుతాయి… వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం.. ఈ వారాహి దేవి కవచం పారాయణం చేస్తే…. ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని పండితులు చెబుతారు. అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రివేళల్లో వారాహి అమ్మవారిని పూజిస్తారు..
వారాహి అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి…శత్రుభయం ఉండదు. అపార జ్ఞానం సిద్ధిస్తుంది. కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ చెప్తారు.. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకల జయాలూ సిద్ధిస్తాయని భక్తుల నమ్ముతారు.