తెలంగాణలో మహిళలను ఔత్సాహకి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మహిళలకు లక్ష కోట్ల వరకూ వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఈమధ్యే తెలిపారు. ఏడాదికి 20 వేల కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క కూడా ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నారు.
లోన్ ఎలా ఇస్తారు ?
మహిళలు ఎవరికి వారే వ్యక్తిగతంగా వెళ్ళి లోన్ కావాలని బ్యాంకుల్లో అడిగితే వెంటనే ఇవ్వరు. దానికి ఓ పద్దతి ఉంది. అదేంటి అంటే… మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక సంఘాల్లో… అంటే డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి. ఈ సంఘాల్లో చేరిన మహిళలకు మాత్రమే ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుంది.
డ్వాక్రా గ్రూపుల్లో చేరిన మహిళలకు స్త్రీనిధి, ఇందిరా మహిళాశక్తి లాంటి పథకాలే కాకుండా…. మెప్మా, సెర్ప్ లాంటి సంస్థల ద్వారా కూడా రుణాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రుణాల్లో కొన్నింటికి అసలు వడ్డీ ఉండదు. కొన్నింటికి నామమాత్రంగా పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు. డ్వాక్రా గ్రూప్ ద్వారా మహిళా సభ్యులు ఉపాధి కోసం తీసుకున్న మొత్తాన్ని…. నెలవారీగా EMIల రూపంలో చిన్న మొత్తాల్లో తీర్చడానికి అవకాశం కల్పిస్తారు. కొన్ని లోన్స్ ఐదేళ్ళ దాకా తీర్చుకునే ఛాన్సుంది. మరి ఆ లోన్ రావాలంటే ఏం చేయాలి ?
ఎలా అప్లయ్ చేయాలి ?
ముందుగా మహిళలంతా డ్వాక్రా సంఘంగా ఏర్పడాలి. ఇప్పటికే నడుస్తున్న స్వయం సహాయక సంఘాల్లో ఖాళీలు ఉంటే మీరు కూడా చేరవచ్చు. లేదంటే సొంతంగా డ్వాక్రా గ్రూప్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు సెర్ఫ్ అధికారులు సాయం చేస్తారు. డ్వాక్రా సంఘంగా ఏర్పడగానే వెంటనే అడిగినంత లోన్ ఇవ్వరు. ఆ లోన్ మీ సంఘం సభ్యులు ఏం చేయాలి అనుకుంటున్నారు అన్న దానిపై కచ్చితమైన ప్లాన్ ఉండాలి. అంటే మీరు చేపట్టబోయే పరిశ్రమకు సంబంధించిన ఐడియా ఉండాలి… దానికి ప్రాజెక్ట్ రిపోర్టును కూడా తయారు చేసుకోవాలి. మీరు ఫౌల్ట్రీ లేదా డైరీ ఫామ్… లేదా ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టాలి అనుకుంటే… మీ డ్వాక్రా గ్రూపు సభ్యులంతా చర్చించుకోవాలి. ఆ తర్వాత గ్రూపు లీడర్ తమ ప్రాజెక్ట్ సంగతిని అధికారుల దృష్టికి తెస్తారు.
ఏం బిజినెస్ పెడతారు ?
మీరు ఏ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో… అది ఎక్కడ ఏర్పాటు చేస్తారు ? మీకు బిజినెస్ ఉంటుందా… దాని నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు… గ్రూపు సభ్యులంతా కలసి పనిచేస్తారా ? లేదంటే బయటి పనివాళ్ళని పెట్టుకుంటారా… మీ ప్రాజెక్ట్ కు బడ్జెట్ ఎంత కావాలి ? మిషన్లు లాంటివి కావాల్సి వస్తే… ఎక్కడ నుంచి తేవాలి… ఎవరు సప్లయ్ చేస్తున్నారు… ఇలా అన్ని విషయాలను పరిశీలించిన అధికారులు… Detailed Project Report ను తయారు చేయిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు, బ్యాంకు ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చి… మీరు స్థాపించబోయే పరిశ్రమకు లోన్ వచ్చేలా చూస్తారు.
మీరు లోన్ కోసం అప్లయ్ చేసిన తర్వాత… మీ DPRని ఉన్నతాధికారులు, బ్యాంక్ సిబ్బంది పరిశీలిస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి కనీసం రెండు నెలల టైమ్ పడుతుంది. ఆ తర్వాత మీ డ్వాక్రా గ్రూప్ పేరున ఉన్న జాయింట్ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది. కేవలం ప్రాజెక్ట్ పేరు చెప్పి… డబ్బులు డ్రా చేసుకుంటాం అంటే కుదరదు. తప్పనిసరిగా మీరు పరిశ్రమను పెట్టేదాకా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ తనిఖీలు చేస్తారు. బిజినెస్ ఎలా సాగుతుందో పరిశీలించి ప్రతి 3 నెలలకు ఓసారి ప్రభుత్వానికి రిపోర్టు పంపుతారు. మీరు ఆ బిజినెస్ నడపడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కుంటుంటే అధికారు మీకు సాయం చేస్తారు. వాటికి పరిష్కారం చూపిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం చాలా మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో చేరి… ఇలా సొంత వ్యాపారాలు నడుపుకుంటున్నారు.
డ్వాక్రా మహిళలతో గవర్నమెంట్ ఆఫీస్ ఏరియాల్లో క్యాంటిన్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఇవే కాకుండా నాటు కోడి ఫారాలు, డెయిరీ ప్రొడెక్ట్స్ బిజినెస్, మొబైల్ ఫిష్ క్యాంటిన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రతి జిల్లాకు 500 మందికి పాడి పశువులను అందిస్తారు. అందుకోసం ఒక్కో సభ్యురాలికి లక్ష రూపాయల రుణం ఇస్తారు. నాటు కోళ్ళ పెంపకానికి జిల్లాకు 3 కోట్లతో 2000 డ్వాక్రా గ్రూపు సభ్యులకు మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.15వేలు సాయం అందుతుంది. వీటితో దాదాపు 100 వరకూ నాటు కోళ్ళ పిల్లలను తెచ్చి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మండలానికి ఒక కోళ్ళ ఫారానికి రెండు లక్షల 91 వేల దాకా లోన్ ఇస్తున్నారు. చేపలు, పాల విక్రయ కేంద్రాలకు ఒక్కో యూనిట్ కి లక్షా 90 వేల రూపాయల దాకా రుణం ఇస్తున్నారు.
మహిళా సంఘాల రుణాలు రావాలంటే ముందుగా డ్వాక్రా గ్రూప్ గా ఏర్పడాలి. అందుకోసం వెంటనే మీకు దగ్గర్లో ఉన్న మండల పరిషత్ కార్యాలయంలో అధికారులను కలుసుకోవాలి.