498A TEA CAFE
జైపూర్ : రాజస్థాన్‌లోని బారన్ జిల్లా అంటా పట్టణంలో ఓ వినూత్న నిరసన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్య పెట్టిన తప్పుడు కేసులతో విసిగిపోయిన ఓ భర్త, అత్తారింటి ఎదురుగానే ‘498ఏ టీ కేఫ్’ పేరుతో టీ కొట్టు పెట్టాడు. అంతేకాదు చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు.]
అసలు ఏమైంది?
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ (కెకె) అనే వ్యక్తికి 2018లో మీనాక్షితో పెళ్ళి జరిగింది. వీళ్లిద్దరూ కలిసి తేనెటీగల పెంపకం (బీ-కీపింగ్) వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ సూపర్ సక్సెస్ అయింది, చుట్టుపక్కల మహిళలకు కూడా ఉపాధి కల్పించారు. అందరూ వీళ్లని మెచ్చుకున్నారు. కానీ, 2022లో మీనాక్షి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత, ఆమె కృష్ణపై సెక్షన్ 498ఏ (వరకట్న వేధింపులు), సెక్షన్ 125 (భరణం) కింద కేసులు పెట్టింది. కృష్ణ ఈ కేసులను తప్పుడు ఆరోపణలు అని చెబుతున్నాడు. “ఈ కేసుల వల్ల నా జీవితం నాశనమైంది. మూడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా, న్యాయం దొరకడం లేదు,” అని ఆవేదన చెందుతున్నాడు. ఒకప్పుడు UPSC పరీక్షలకు సిద్ధమవుతున్న కృష్ణ, ఈ కేసులతో చదువును వదిలేసి, న్యాయం కోసం పోరాడుతున్నాడు.
‘498ఏ టీ కేఫ్’ ఎందుకు?
ఈ అన్యాయానికి నిరసనగా, కృష్ణ 220 కి.మీ. దూరం ప్రయాణించి, అత్తారింటి ఎదురుగా రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో ‘498ఏ టీ కేఫ్’ అనే టీ స్టాల్ పెట్టాడు. ఈ పేరు ఎందుకంటే, ఆమె పెట్టిన వరకట్న వేధింపుల కేసు సెక్షన్ 498ఏ కింద రిజిస్టర్ అయింది. అంతేకాదు, తన బాధను ప్రపంచానికి చెప్పడానికి చేతులకు బేడీలు వేసుకుని, పెళ్లి దుస్తుల్లో వరమాల, సెహ్రా (పెళ్లి టోపీ) ధరించి టీ అమ్ముతున్నాడు.
టీ స్టాల్‌పై బ్యానర్లు, పోస్టర్లు కూడా పెట్టాడు. “జబ్ తక్ నహీ మిల్తా న్యాయ్, తబ్ తక్ ఉబల్తీ రహేగీ చాయ్!” (న్యాయం దొరికే వరకూ ఈ టీ మరుగుతూనే ఉంటుంది), “సెక్షన్ 125 కింద ఎంత భరణం ఇవ్వాలో చాయ్ తాగుతూ చర్చించండి!” లాంటి నినాదాలతో బ్యానర్లు ఏర్పాటు చేశాడు. ఈ స్టాల్ కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు, తన న్యాయపోరాటానికి ఒక సంకేతం అని కృష్ణ చెబుతున్నాడు.
మీనాక్షి వైపు కథ ఏంటి?
మరోవైపు, మీనాక్షి మాత్రం కృష్ణపై తీవ్ర ఆరోపణలు చేసింది. “నా భర్త భూమి కొనుగోలు కోసం నా తండ్రిని డబ్బు అడిగాడు. నా తండ్రి నిరాకరించడంతో నన్ను వేధించాడు. అందుకే పుట్టింటికి వెళ్లిపోయాను,” అని ఆమె చెప్పింది. తాను కృష్ణ నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ అందుకు ముందు అతను తన తండ్రి నుంచి తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్!
‘498ఏ టీ కేఫ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నెటిజన్లు ఈ విషయంపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు, “కృష్ణ నిరసన వినూత్నంగా ఉంది. సెక్షన్ 498ఏ దుర్వినియోగం అవుతోందని దీన్ని బట్టి తెలుస్తోంది” అని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు, “ఈ విషయంలో ఇద్దరి వాదనలూ వినాలి. న్యాయం కోసం కోర్టు తీర్పే ఆధారం,” అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ టీ స్టాల్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సెక్షన్ 498ఏ అంటే ఏంటి?
సెక్షన్ 498ఏ (ఇండియన్ పీనల్ కోడ్) 1983లో పెళ్లైన మహిళలను భర్త, అతని కుటుంబం నుంచి వేధింపుల నుంచి కాపాడేందుకు తీసుకొచ్చిన చట్టం. ఇది వరకట్న వేధింపులు, గృహ హింసను నేరంగా పరిగణిస్తుంది. అయితే, ఈ సెక్షన్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, తప్పుడు కేసులతో భర్తలు, వాళ్ల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా 2024లో దీని దుర్వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
Read also : కావ్యా పెళ్లిపై గుస గుసలు !! పాప సంపాదన ఎంతో తెలుసా !!
Read also : ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తుక్కు తుక్కు : ఇరాన్ మామూలు దెబ్బ కొట్టలేదుగా
Read also : ఆ 30 సెకన్లలో ఏం జరిగింది ?