భగవద్గీత… అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన… అంటూ ఘంటశాల వారి కంఠం వింటే ఎక్కడలేని అనుభూతి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మన ముందుకు వచ్చి బోధిస్తున్నాడన్న ఫీలింగ్. గీతలోని ఒక్కో అధ్యాయం చదువుతూ దాన్ని విడమర్చి ఘంటశాల వారు చెబుతుంటే … మన దేహం భూమ్మీద ఉన్నట్టు అనిపించదు.
గీత అంటే మన బతుకు. మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించిన అమూల్యమైన సంపద. దాన్ని రోజూ పారాయణం చేస్తేనో….. రోజుకి వంతు పెట్టుకొని రెండు, మూడు పేజీలు… లేదంటే ఒక అధ్యాయం చదివితే సరిపోదు. దాన్ని ఒంటబట్టించుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. భగవానుడు ఎప్పుడో 5 వేల యేళ్ళ క్రితం ఆ నాటి దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చెప్పాడు. కానీ నేటికీ ఆచరణ యోగ్యమైనది భగవద్గీత. భవిష్యత్తు తరాలకీ మార్గదర్శనం.
భగవద్గీత ఆవిర్భవించిన రోజును గీతా జయంతిగా జరుపుకుంటాం. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి నాడు సనాతనమైన ఈ గీతా జ్ఞానాన్ని శ్రీ కృష్ణుడు… అర్జునుడి ద్వారా లోకానికి అందించాడు. అదే 2024 సంవత్సరంలో డిసెంబర్ 11 నాడు వచ్చింది. “మాసానాం మార్గ శీర్షోహం… మాసములలో మార్గశీర్ష మాసాన్ని నేనే అంటాడు భగవంతుడు. అంటే మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటో దీన్నిబట్టి తెలుస్తుంది. మన జీవితానికి మార్గ నిర్దేశనం చూపించే భవిష్యత్ దర్శని భగవద్గీత.
ఇది కూడా చదవండి : గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలసి ఉంటాయి ?
గీత గురించి మహాత్మాగాంధీ ఏమన్నారంటే….
“సందేహాలు నన్ను ఆవహించినప్పుడు… నిరాశ, నిస్పృహలు కమ్ముకున్నప్పుడు… నేను భగవద్గీతను తెరిచి చూస్తాను. అందులో ఏదో ఒక శ్లోకం నన్ను ఊరడించి… స్వాంతన చేకూరుస్తుంది” అంటారు.
ఒక్క మహాత్ముడే కాదు… నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివేకానంద, అరవిందులు… ఇలాంటి ఎందరో దేశ, విదేశీ మహానుభావులకు ప్రేరణ కలిగించింది భగవద్గీత.
భగవద్గీత ఎక్కడి నుంచి చదవాలి ?
అసలు ఏ గ్రంథమైనా మొదటి అధ్యాయం నుంచి చదవడం సంప్రదాయం. కానీ శ్రీ మలయాళ స్వాముల వారు మాత్రం తమ శ్రీకృష్ణాశయం అనే గ్రంథంలో ద్వాదశ అధ్యాయమైన భక్తియోగాన్ని వివరిస్తూ… గీతా పారాయణం చేసేవారు మొదటి నుంచీ ప్రారంభించకుండా… 12వ అధ్యాయం నుంచి మొదలు పెట్టడం మంచిదని చెప్పారు. అదే పరంపరా ధర్మమని కూడా తెలిపారు. అలా చేస్తే విఘ్నాలు కలగవని వివరించారు.
12వ అధ్యాయంలో ఏముంది ?
భగవద్గీతలోని 12వ అధ్యాయంలో అమృతసమమైన వాక్కులు ఉన్నాయి. ఈ అధ్యాయంలోని శ్లోకాలు చాలా చిన్నవి. అనుష్టుప్ ఛందస్సులో 20 మాత్రమే ఉన్నాయి. మొదటి అధ్యాయం దు:ఖవార్తలతో ఉంటుంది. అందులో 47 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధం వల్ల కలిగే క్లేశం గురించి అందులో వివరించారు. అందుకే మొదటి అధ్యాయానికి బదులు… భక్తి తత్వాన్ని వివరించే ద్వాదశ అధ్యాయంతో గీతా పారాయణం ప్రారంభించడం యుక్తమని పెద్దలు భావించారు… అని శ్రీ మలయాళ స్వాముల వారు వివరించారు.
గీతా జయంతి నాడు ఏం చేయాలి ?
గీత చదివే చోట… వినే చోట నేను అదృశ్యంగా ఉంటాను – అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. అందుకే గీతా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి… శ్లోకం, ప్రతి పదార్థ, భావాలను చదవి, అర్థం చేసుకోవాలి. ఆచరించాలి… ఒక్క గీతా జయంతి రోజే కాదు… ప్రతి రోజూ భగవద్గీత పఠనం మన జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తుంది.