జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాతికేళ్లు రాజకీయాలు చేయానికి ప్రజల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. ఇప్పటికే పార్టీ పెట్టి పదేళ్లు దాటి పోయింది. మొదటి సారి జనసేన అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే గత పదేళ్ల నుంచి కూడా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. కనీసం 2024 ఎన్నికలకు ముందు వరకూ కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలి అన్నదానిపైనా కన్ ఫ్యూజన్ నడిచింది. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా… కలకాలం పదిలంగా ఉండాలి… జనంలో ఉండాలి అనుకుంటే… గ్రౌండ్ లెవల్లో బలమైన కార్యకర్తల బలం ఉండాలి… ఆ తర్వాత పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. కార్యకర్తలతా డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ నో, నాదెండ్ల మనోహర్ నో… నాగబాబునో కలిసే అవకాశం అస్సలు ఉండదు. అందుకే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటే ఆ నేతలను సంప్రదించి తమ పనులు చేసుకోడానికి… పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ కార్యకర్తలకు అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీతో పాటు బీజేపీకి కూడా కొద్దో గొప్పో… పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంది. ఎందుకంటే బీజేపీ ఓటు బ్యాంకు తక్కువే అయినా… ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి నేతలు ఉన్నారు. పట్టణాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక టీడీపీ, వైసీపీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రెండు పార్టీలు గ్రౌండ్ లెవల్లో బలమైన పార్టీలు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి బలం, బలగం ఉన్న పార్టీలవి. జనసేనకు బలగం రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాన్ని కింది స్థాయి దాకా లీడ్ చేసే వాళ్ళు మాత్రం కనిపించడం లేదు. నేను ఏడాది క్రితం అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ ఛానెల్ పనిచేస్తున్నప్పుడు ఇదే వార్త రాశా. ఇప్పుడు జనసేన అధికారంలో ఉంది… అయినా అదే పరిస్థితుల్లో ఉంది… ఏ మాత్రం కూడా మార్పు రాలేదు.
ఒ గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వచ్చినా, సమస్య చెప్పుకోవాలనుకున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది…. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా జనసేన నిర్మాణంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు… ఆయనకు ఇంకో భయం కూడా ఉన్నట్టు ఉంది. పార్టీ పదవులను అప్పగిస్తే వాటిని దుర్వినియోగం చేస్తారన్న భయం ఉంది… అందుకే నిర్మాణం చేపట్టలేదన్న వాదన ఉంది… ఇందులో కొంత నిజమున్నా పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నిర్మాణం తప్పకుండా అవసరం. ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలనుకున్నా ఎవరిని సంప్రదించాలన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. పవన్ కల్యాణ్ అందరికీ అందుబాటులో ఉండరు. అదే సమయంలో తర్వాత స్థానంలో ఉన్న నేతలతో సంప్రదించాలన్నా అది సాధ్యపడటం లేదని అంటున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. పార్టీ సెంట్రల్ ఆఫీసుకు వచ్చి తమ గోడు చెప్పుకున్నా కొందరికి మాత్రమే పవన్ తర్వాత నేతల దర్శనమవుతుంది. అందరికీ సాధ్యపడటం లేదు. దీంతో జనసైనికుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందున్న ఉత్సాహం కూడా జనసైనికుల్లో కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ బయటకు వచ్చినప్పటికీ ఆయన సినీ అభిమానులు తప్ప… నిజమైన జనసైనికులు పెద్దగా రావడం లేదని అంటున్నారు… కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా… తమకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో జనసైనికులు ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో వేరే చేప్పాల్సిన పనిలేదు. అందుకే జనసైనికుల్లో ప్రస్తుతం అసంతృప్తి బాగా పేరుకుపోయిందని అనేక సర్వేల బట్టి తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీ నిర్మాణానికి తాము పడిన కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదన్న నిరాశ ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది. పవన్ ఇప్పటికైనా మేలుకోకపోతే.. తర్వాత రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు.
Also read: ఆధార్ అప్‌డేట్ మరో ఏడాది ఫ్రీ!
Also read: వాట్సాప్‌లో కొత్త యాడ్స్ ఫీచర్!
Also read: కాంతార – శాపగ్రస్త సినిమా?