కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ సీటుపై లొల్లి

Latest Posts Top Stories Trending Now

ఒక్క సీటుకు ఆరుగురు పోటీ
(యువ తెలంగాణ, హైదరాబాద్ ): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరగబోయే ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన యుద్ధమే నడుస్తోంది. ఈ ఎమ్మెల్యే సీటు కోసం కాంగ్రెస్‌లో ఏకంగా ఆరుగురు నాయకులు పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. అన్ని పార్టీలూ ఇప్పటి నుంచే వ్యూహాలు ప్రిపేర్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌లో మాత్రం సీటు కోసం గొడవలు మొదలయ్యాయి. ఒకరు, ఇద్దరు కాదు, ఏకంగా అరడజను మంది నాయకులు జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ఒక అడుగు ముందుకేసి, “ఈసారి జూబ్లీహిల్స్ టిక్కెట్ నాదే!” అని మీడియా ముందు ప్రకటించేశాడు.

గత ఎన్నికల్లో అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్‌తో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి, “గట్టిగా ప్రచారం చేస్తా, నేనే గెలుస్తా!” అంటూ సీటు ప్రకటించకముందే స్వీట్లు పంచడం మొదలుపెట్టారు. అజారుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, “అదేం కుదరదు, టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో ఇంకా అధిష్ఠానం నిర్ణయించలేదు” అని తేల్చేశారు. ఇంకోవైపు, ఫిరోజ్ ఖాన్ కూడా జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై కన్నేశారు. “నాకు సీటు ఇస్తే, కాంగ్రెస్ సత్తా చూపిస్తా!” అని బహిరంగంగా చెబుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, రేవంత్‌కి సన్నిహితుడు కావడంతో తనకే టిక్కెట్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు. పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా జూబ్లీహిల్స్ సీటు కోసం ఫుల్ స్పీడ్‌లో లాబీయింగ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిన విజయారెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి రావడంతో ఆమెకు జూబ్లీహిల్స్ ఒక్కటే ఆప్షన్. “నా తండ్రి చరిష్మాతో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా!” అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ సీటు తనకే కావాలని డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్, ఎంఐఎంతో మంచి సంబంధాలున్నాయని, సీటు ఇస్తే గెలుపు గ్యారెంటీ అని అధిష్ఠానానికి హామీ ఇస్తున్నారు. అటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. “నేను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని, నా భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం. మేయర్‌గా నా అనుభవం, గ్రేటర్ హైదరాబాద్‌లో పరిచయాలతో గెలుపు ఈజీ!” అని అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇంకోవైపు, సీఎం రేవంత్ సన్నిహితుడైన మైనారిటీ లీడర్ వహీం ఖురేషీ కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం. ఇలా ఆరుగురు నాయకులు “సీటు మాదే!” అంటూ బహిరంగ గొడవకు దిగారు. అయితే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ఎంఐఎం ఒక ట్విస్ట్ ఇచ్చింది. “కాంగ్రెస్ మైనారిటీ అభ్యర్థిని నిలబడితే, మేం కూడా పోటీలోకి దిగుతాం!” అని హెచ్చరించింది. జూబ్లీహిల్స్‌లో 3.75 లక్షల ఓట్లలో 1.25 లక్షలకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఎంఐఎంతో ఢీకొట్టడం కంటే మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుంది? ఈ ఆరుగురిలో ఎవరికి టిక్కెట్ ఇస్తుంది అన్నది చూడాలి.

Also read: పావలా కోడికి బారాన మసాలా అంటే ఇదే !

Also read: మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?

Also read: పావలా కోడికి బారాన మసాలా అంటే ఇదే !

Also read: పావలా కోడికి బారాన మసాలా అంటే ఇదే !

Tagged