శ్రీశైలం పుణ్య క్షేత్రంలో కార్తీక పౌర్ణమి (Karthika pournami) సందర్భంగా జ్వాలాతోరణోత్సవం వైభవంగా జరుగుతుంది. పాతాళగంగ దగ్గర కృష్ణమ్మకు (Krishna River) శాస్త్రోకంగా హారతి ఇస్తారు. ఆలయంలో గంగాధర మండపం దగ్గర జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాన్ని దర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నేతితో తడిపిన నూలు వత్తులను తోరణంగా ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ భస్మాన్ని నుదుట రాసుకుంటే దీర్ఘాయుష్షుతో పాటు ఐశ్వర్యం దక్కతుందని భక్తులు నమ్ముతారు.
కృష్ణమ్మకు పుణ్యహారతి
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలోని (Srisailam) పాతాళ గంగ దగ్గరున్న కృష్ణమ్మ తల్లి విగ్రహానికి సాయంత్రం పుణ్య నదీ హారతి కార్యక్రమం జరుగుతుంది. పాతాళగంగ స్నానఘాట్ల దగ్గర విశేష పూజలు, సారె సమర్పణ, నీరాజనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత పుణ్యనదికి నవ హారతులు ఇస్తారు.

జ్వాలాతోరణం (Jwala Thoranam) వెనుక గాథ ఏంటి ?
పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు. భూమి మధ్యలో ఉన్న మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకీ సర్పాన్ని తాడుగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతారు. పర్వతాన్ని సముద్రంలోకి దించగానే అది పట్టు తప్పి పడిపోవడంతో శ్రీమహావిష్ణువు (Sri Vishnu) కూర్మావతారంలో వచ్చి సాగరం అడుగుకు వెళ్లి తన వీపుపై పర్వతాన్ని పైకి ఎత్తుతారు. ఆ తర్వాత దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధిస్తారు. అందులో నుంచి మొదట హాలాహలం పుడుతుంది. అన్ని లోకాలనూ దహించివేయగల ఆ కాల కూట విషాన్ని పరమశివుడు స్వీకరిస్తాడు. శివుడు లోకహితం కోసం సేవించి కంఠంలో ఉంచుకోవడంతో ఆయన కంఠం నీలంగా మారింది. దాంతో భయపడిన పార్వతీదేవి తన భర్తకు ఏ కీడు కలగకుండా ఈ ఆపద నుంచి బయటపడితే.. తాను భర్తతో పాటు చిచ్చుల తోరణం కింద మూడు సార్లు నడిచి వస్తానని మొక్కుకుందట. తర్వాత శివుడికి (Lord Shiva) ఎలాంటి ఆపద రాకపోవడంతో పార్వతీదేవి (Parvathi devi) శివుడితో కలిసి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద మూడు సార్లు నడిచారట. అప్పటి నుంచి జ్వాలాతోరణ మహోత్సవం మొదలైనట్టు పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Pournami: కార్తీక పౌర్ణమి… జ్వాలాతోరణం దాటారంటే ! (చాగంటి గారి మాటల్లో ?)