ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల ముందు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. శివ కేశవులకు ఎంతో ఇష్టమైనది కార్తీక మాసం. ఈ నెలలోని పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని నమ్ముతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత, ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. ఈ జ్వాలను దర్శించుకోవడం వల్ల మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిమి కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదని అంటారు.
కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల ముందు రెండు కర్రలు నిలుపుగా పాతుతారు. ఓ కర్రను వాటికి అడ్డంగా పెడతారు. ఆ అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీన్ని యమద్వారం అంటారు. దీనిపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి శివుడిని పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ జ్వాలతోరణ మహోత్సవం గురించి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో వర్ణించారు. ద్రాక్షరామంలో జరిగే మహోత్సవాన్ని ఆయన ఇందులో రాశారు.
జ్వాలాతోరణం దర్శనం ఎందుకు ?
జ్వాలతోరణం దర్శించిన వారికి యమ లోక ద్వారం చూడాల్సిన అవసరం ఉండదంటారు పెద్దలు. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తూ…ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. ఇక ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా చూడాలంటూ పరమేశ్వరుడిని ప్రార్థించాలి. జ్వాలాతోరణంలో కాలిపోయిన తర్వాత మిగిలిన గడ్డిని తీసుకొచ్చి.. ఇంటి చూరు, గడ్డివాము లేదంటే ధాన్యాగారంలో పెడతారు. అలా పెట్టుకుంటే సుఖశాంతులు కలుగుతాయని చెబుతారు. అంతేకాదు భూత ప్రేతాలు ఇంట్లోకి రావని ఓ ప్రసంగంలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు.
ఇది కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంలో జ్వాలాతోరణానికి ప్రత్యేకత
https://teluguword.com/srisailam-jwala-thoranam/