ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, లాభాల క్షీణత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరిగాయి. ఈ కారణాలతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2019లో కరోనా వైరస్ సంక్షోభంతో ప్రారంభమైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షకు పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోయాయి, ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్‌లో 9,100 మందిపై వేటు
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఖర్చులు తగ్గించుకోడానికి మళ్ళీ లేఆఫ్స్ ప్రకటించింది. సంస్థలో 4 శాతానికి తక్కువ కాకుండా, అంటే దాదాపు 9,100 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ కోతలు ప్రధానంగా Xbox, గేమింగ్ విభాగాల్లో ఉంటాయి. గత ఏడాదిన్నర కాలంలో ఇది నాలుగో అతిపెద్ద లేఆఫ్ కావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మేలో 6,000 మందిని, 2023లో 10,000 మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్, మార్కెట్ పోటీలో ముందంజలో ఉండేందుకు సంస్థాగత మార్పులను అమలు చేస్తున్నామని అంటోంది.
ఇంటెల్‌లో 20 శాతం కోత
చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం వరకు తొలగించేందుకు సిద్ధమవుతోంది. జూలై మధ్యలో ఈ కోతలు ఉంటాయి. ఇందులో చిప్ డిజైన్, క్లౌడ్, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు ఉంటారు. సమర్థతను పెంచడం, చిన్న బృందాలతో స్పీడ్ గా పనిచేయడమే లక్ష్యమని ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ తెలిపారు.
ఇతర సంస్థల్లోనూ లేఆఫ్స్
అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు ఇతర టీమ్‌లలో వందల మందిని తొలగించనుంది. రాబోయే రోజుల్లో దాదాపు 14 వేల మందిని (13 శాతం) తొలగించే ఆలోచనలో ఉంది. ఐబీఎమ్ 8,000 మందిని, ప్రధానంగా హెచ్‌ఆర్ విభాగం నుంచి తొలగించింది, ఇందులో ఏఐ ఆధారిత ఆటోమేషన్ ద్వారా 200 స్థానాలను భర్తీ చేశారు. ఇండియన్ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగులను ఇంటర్నల్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో తొలగించింది. గూగుల్, టిక్‌టాక్, ఓలా ఎలక్ట్రిక్, హెచ్‌పీ, సేల్స్‌ఫోర్స్, బ్లూ ఆరిజన్, సిమెన్స్ లాంటి సంస్థలు కూడా వందల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
ఏఐ నైపుణ్యాల డిమాండ్
టెక్ కంపెనీలు ఓ వైపు ఉద్యోగులను తొలగిస్తున్నా, ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రియారిటీ ఇస్తున్నాయి. సాధారణ ఉద్యోగులను తొలగిస్తూ, ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు తమ కార్యకలాపాలను ఏఐ ఆధారంగా రీ స్ట్రక్చర్ చేసుకుంటూనే, మార్కెట్‌లో పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాయి.
Also read: భారత్ దెబ్బకు పాకిస్తాన్ విల విల !
Also read: బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు