రష్యా చమురు కొంటే భారత్‌కు నష్టమా?

Latest Posts Money Matters Trending Now

: అమెరికా ఆంక్షల హెచ్చరికలు ఎందుకు ?

అమ్మ పెట్టదు… అడుక్కు తిననీయదు… అన్నట్టుంది అమెరికా పరిస్థితి… రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొంటోంది, అది కూడా తక్కువ ధరకే. కానీ, ఇప్పుడు అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహమ్ ఓ బిల్లు తీసుకొచ్చారు. రష్యా చమురు కొనే దేశాలపై 500 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నారట. అసలు ఈ ఆంక్షల వల్ల భారత్‌కు ఏం నష్టం జరుగుతుంది? అమెరికాకు ఇలాంటి ఆంక్షలు పెట్టే అధికారం ఎక్కడిది? భారత్ అమెరికాపై ఆధారపడకుండా ఉండలేదా?

రష్యా నుంచి చౌకగా చమురు ?
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు, ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ సమయంలో రష్యా, భారత్‌కు చౌకగా చమురు సప్లై చేయడానికి ముందుకొచ్చింది. యుద్ధానికి ముందు, భారత్ దిగుమతి చేసే చమురులో రష్యా వాటా కేవలం 1 శాతం కంటే తక్కువ. కానీ ఇప్పుడు అది 40-45 శాతానికి చేరింది. రష్యా చమురు దుబాయ్ క్రూడ్ కంటే బ్యారెల్‌కు 3 డాలర్లు తక్కువగా దొరుకుతోంది. దీని వల్ల భారత్‌కు ఇంధన ఖర్చులు తగ్గి, ఆర్థికంగా లాభం చేకూరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలు రష్యాతో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉదాహరణకు, గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీకి 10 ఏళ్ల పాటు రోజుకు 5 లక్షల బ్యారెల్స్ చమురు సప్లై చేసే డీల్ కుదిరింది.

అమెరికా ఆంక్షలతో భారత్‌కు నష్టమేనా ?

ఇప్పుడు అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహమ్ ప్రతిపాదించిన బిల్లు వస్తే, రష్యా చమురు కొనే భారత్, చైనా లాంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై 500 శాతం ట్యాక్స్ విధిస్తారు. దీని వల్ల భారత్‌కు ఎగుమతి చేసే మెడిసన్స్, బట్టలు, ఐటీ సేవలు, ఆటోమొబైల్ భాగాలు లాంటివి అమెరికా మార్కెట్‌లో ఖరీదైనవి అవుతాయి. అమెరికా భారత్‌కు అతి పెద్ద ఎగుమతి మార్కెట్. 2024-25లో భారత్ నుంచి అమెరికాకు 77 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు, సేవలు ఎగుమతి అయ్యాయి. ఇందులో మెడిసన్స్, ఐటీ సేవలు, టెక్స్‌టైల్స్, ఆభరణాలు ప్రధానమైనవి. 500 శాతం సుంకం వస్తే, ఈ ఉత్పత్తుల ధరలు పెరిగి, అమెరికాలో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల భారతీయ పరిశ్రమలు నష్టపోవచ్చు,
ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చు.
అంతేకాదు, రష్యా చమురు సప్లై ఆగిపోతే, భారత్ మిడిలీస్ట్ లాంటి ఇతర దేశాల నుంచి చమురు కొనాలి. అవి రష్యా కంటే ఖరీదైనవి కావొచ్చు. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, దేశీయంగా ఇంధన ఖర్చులు పెరుగుతాయి. అయితే, రష్యా డిప్యూటీ ఆయిల్ మినిస్టర్ పావెల్ సోరోకిన్ ఈ ఆంక్షలు చట్టవిరుద్ధమని, భారత్‌కు చమురు సప్లైపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్పారు.

అమెరికాకు ఆంక్షలు పెట్టే అధికారం ఎక్కడిది?

అసలు అమెరికాకు భారత్‌పై ఆంక్షలు పెట్టే అధికారం ఎక్కడిది? అమెరికా ఒక సార్వభౌమ దేశం, దాని విదేశాంగ విధానంలో భాగంగా ఇతర దేశాలతో వాణిజ్య నిబంధనలను నిర్ణయించే హక్కు ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా ఈ ఆంక్షలను ప్రతిపాదిస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతి పెద్దది, డాలర్ అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రధాన కరెన్సీ. దీని వల్ల అమెరికాకు ఆంక్షలు విధించే శక్తి ఉంది. కానీ, ఇవి చట్టవిరుద్ధమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని రష్యా వాదిస్తోంది. భారత్ కూడా ఈ ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా సెనేటర్‌తో ఈ విషయంపై చర్చించారు.

అమెరికాపై ఆధారం తగ్గిస్తే ?
భారత్ అమెరికాపై ఆధారపడటం పూర్తిగా ఆపేయలేదా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. 2024-25లో భారత్ అమెరికా నుంచి 54 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు, సేవలు దిగుమతి చేసింది. ఇందులో ప్రధానంగా ఆయిల్, నేచురల్ గ్యాస్, విమాన భాగాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్ రసాయనాలు ఉన్నాయి. అమెరికా భారత్‌కు మూడో అతి పెద్ద ఎగుమతి మార్కెట్ కూడా. ఈ ఆధారాన్ని తగ్గించడం అంటే, భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచాలి, కొత్త మార్కెట్లు వెతకాలి. ఇది సాధ్యమే, కానీ సమయం, ఖర్చు ఎక్కువ అవుతాయి. ఉదాహరణకు, ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 42-50 శాతం ఉంది, అమెరికా వాటా కేవలం 5-7 శాతం. కాబట్టి, ఆయిల్ విషయంలో అమెరికాపై ఆధారం తక్కువే.
కానీ, ఐటీ సేవలు, మెడిసన్స్, టెక్స్‌టైల్స్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ కీలకం. ఈ మార్కెట్‌ను కోల్పోతే, భారత ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగులుతుంది. అయితే, భారత్ ఇప్పటికే చైనా, యూరప్, ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంచుతోంది. రష్యాతో ఇంధన ఒప్పందాలు, రూపాయి-రూబుల్ వాణిజ్యం లాంటివి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలే.

భారత్ ఏం చేయాలి?
అమెరికా ఆంక్షలు భారత్‌కు సవాలే, కానీ పూర్తిగా అమెరికాపై ఆధారపడటం లేదు. రష్యా ఆయిల్ కొనడం వల్ల ఆర్థిక లాభం ఉంది, కానీ అమెరికా మార్కెట్ కోల్పోతే నష్టం కూడా ఉంది. భారత్ ఇప్పుడు బ్యాలెన్సుడ్ గా వ్యవహించారు. రష్యాతో ఇంధన ఒప్పందాలు కొనసాగిస్తూనే, మిడిలీస్ట్, ఆసియా దేశాలతో కొత్త సప్లై చైన్‌లు అభివృద్ధి చేయాలి. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తూ, ఆంక్షల ప్రభావాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయాలి. ఇది భారత్‌కు ఆర్థిక, దౌత్య సవాలు, కానీ సరైన వ్యూహంతో దీన్ని అధిగమించొచ్చు.

Also read: రెండు వారాల్లో 900 ఎర్త్ క్వేక్స్

Also read: ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

Also read: రేపు మెగా సునామీ?

Also read: https://www.msn.com/en-in/news/India/we-ll-cross-that-bridge-jaishankar-on-us-500-tariff-threat-for-russia-business-ties/ar-AA1HSCUu

Tagged

Leave a Reply