1 Bit Coin = కోటి రూపాయలు – ఇలా పెరుగుతోందేంటి ?

Cyber Alerts Latest Posts NRI Times Top Stories Trending Now

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో బిట్ కాయిన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల రోజుల్లోనే దాని విలువ 50శాతానికి పైగా పెరిగింది. సోమవారం నాడు 1.06 లక్షల డాలర్లకు చేరింది. మన రూపాయల్లో చెప్పాలంటే 90 లక్షలు. ఆ తర్వాత 1.05 లక్షల డాలర్ల దగ్గర ఆగింది. అంటే రూ.89.10 లక్షలు. ఒక్క బిట్ కాయిన్ కోటి రూపాయలకు చేరుకోడానికి ఇంకా ఎంతో దూరం లేదు.

Bit coin

“అమెరికాలో వ్యూహాత్మక చమురు నిల్వలలాగే… డిజిటల్ కరెన్సీ జాతీయ నిల్వలను సృష్టించాలని ఆలోచిస్తున్నాం ” – ట్రంప్ చేసిన ఈ ఒక్క స్టేట్ మెంట్ తో బిట్ కాయిన్ ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం 1.05 లక్షల డాలర్ల దగ్గర ఉన్న బిట్ కాయిన్ 1.20 లక్షలకు చేరితే మన కరెన్సీలో కోటి రూపాయలకు చేరినట్టే. అది డిసెంబర్ నెలాఖరులోగా పూర్తవుతుంది. ఇక వచ్చే ఏడాది 2025 మధ్య కల్లా 1.50 లక్షల డాలర్లకు చేరుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఏంటీ క్రిప్టో కరెన్సీ ?

ప్రపంచంలో డాలర్, యూరో, రూపాయి లాగే ఇది కూడా ఓ క్రిప్టో కరెన్సీ. మన కరెన్సీలను RBI సెంట్రల్ బ్యాంకులు కంట్రోల్ చేస్తాయి. కానీ ఈ వర్చువల్ డబ్బులైన క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వాలతో పనిలేదు. కొనేవాడు, అమ్మేవాడు ఉంటే చాలు. ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్లకు పైగా బిట్ కాయిన్స్ ఉన్నాయి. ట్రంప్ గెలిచాక వీటి విలువ పెరుగుతూ వస్తోంది. మన దేశంలో 2 వేల దాకా బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నట్టు చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ తో పాటు ఇథెరియమ్, టీథర్, కార్డానో, పోల్కాడాట్, రిపల్, డోజ్ కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీలు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ నమ్మకం మీద నడుస్తున్నవే తప్ప… వీటికి ప్రత్యేకంగా ఓ రూపం అంటూ ఏది లేదు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ బిట్ కాయిన్ వ్యవస్థ నడుస్తోంది.

Read this also : CIBIL Score : రూల్స్ మారుతున్నయ్ ! అందరూ తెలుసుకోండి

Bit coins

భారత్ లో చట్టబద్ధత లేదు

క్రిప్టో కరెన్సీకి భారత్ లో గుర్తింపు లేదు. 2021లో క్రిప్టో కరెన్సీ నిషేధిత బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ కరెన్సీని నియంత్రించే విధంగా చట్టంలో ప్రతిపాదనలు చేశారు. కానీ 2022 కేంద్ర బడ్జెట్ లో మాత్రం వర్చువల్ డిజిటల్ ఆస్తులు, లేదా క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే లాభాలపై 30శాతం ట్యాక్సు , 1శాతం TDS ను ప్రభుత్వం విధించింది. అంటే క్రిప్టో కరెన్సీని తీసుకున్నా… లేదంటే ట్రాన్స్ ఫర్ చేసిన వాళ్ళకి ఈ ట్యాక్స్ పడుతుంది. కానీ అసలు క్రిప్టో కరెన్సీకి చట్టబద్దత ఉందా… లేదా అన్న విషయంలో మాత్రం భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత్ మాత్రమే కాదు చైనా కూడా దీన్ని అంగీకరించడం లేదు. దక్షిణ అమెరికాలోని ఎల్ సాల్వెడార్ మాత్రం బిట్ కాయిన్స్ ని చట్టపరంగా ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. చైనా మాత్రం ఇలా క్రిప్టోకరెన్సీ మనీ ల్యాండరింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో 1000 మందిని అరెస్ట్ చేసింది. మన దేశంలో అధికారిక ఆమోదం లేకపోయినా… 19 క్రిప్టో ఎక్చేంజ్ మార్కెట్లు నడుస్తున్నాయి. ఈమధ్యే వజీర్ ఎక్స్ అనే సంస్థ మీద ఈడీ దాడులు జరిపింది.

ఇది కూడా చదవండి : Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !

Bit coins

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు

క్రిప్టో కరెన్సీ ఇస్తామంటూ అసలు కరెన్సీ తీసుకొని దారుణంగా మోసం చేస్తున్నారు కొందరు సైబర్ క్రిమినల్స్. ఏపీలోని నంద్యాలలో ఈమధ్యే ఇలాంటి మోసాన్ని పోలీసులు ఛేదించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో 23 కోట్ల రూపాయలు నొక్కేసిన మోసగాడు రామాంజనేయులును అరెస్ట్ చేశారు. 315 మంది బాధితుల నుంచి 23 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నూటికి పది రూపాయల లాభం ఉంటుందని నమ్మించి మోసం చేశాడు.

క్రిప్టో కరెన్సీని చాలా దేశాలు నిషేధించాయి. క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు లేదు. తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు అని అపర కుబేరుడు వారెన్ బఫెట్ లాంటి దిగ్గజాలు సలహా ఇస్తున్నారు. సో… క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో వచ్చే మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ కి స్పందించకుండా ఉండటమే బెటర్.

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Tagged