ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చాబహార్ పోర్ట్ పై ఎఫెక్ట్

Latest Posts Trending Now

ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC). ఈ రెండూ భారత్‌కు ఎందుకు చాలా కీలకం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వీటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అన్నది ఇప్పుడు భారత్ కు టెన్షన్ గా మారింది.

చాబహార్ పోర్ట్ అంటే ఏంటి?

చాబహార్ పోర్ట్ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో, ఒమన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది ఇరాన్‌కు ఏకైక సముద్ర ఓడరేవు. ఈ పోర్ట్ భారత్‌కు చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా, రష్యాతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక గేట్‌వే. పాకిస్తాన్ ద్వారా వెళ్లకుండా, ఈ పోర్ట్ ద్వారా భారత్ కు చెందిన వస్తువులు ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ లాంటి దేశాలకు చేరవచ్చు. ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కూడా చాలా కీలకమైనది.
ఈ పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి భారత్ చాలా పెట్టుబడులు పెట్టింది. 2024లో, భారత్ ఇరాన్‌తో 10యేళ్ళ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, భారత్‌లోని ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (IPGL) చాబహార్‌లోని షాహిద్ బెహెష్టి టెర్మినల్‌ను నిర్వహిస్తుంది. భారత్ ఈ పోర్ట్ అభివృద్ధికి దాదాపు 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది, అలాగే 250 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను అందిస్తోంది

 

అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC) అంటే ?

INSTC అనేది భారత్, ఇరాన్, రష్యా, ఇతర సెంట్రల్ ఆసియా దేశాలను కలిపే ఒక మల్టీ ట్రాన్స్ పోర్ట్ కారిడార్. ఈ కారిడార్ సముద్రం, రైలు, రోడ్డు మార్గాల ద్వారా వస్తువులను రవాణా చేస్తుంది. దీని ద్వారా భారత్ నుంచి వస్తువులు ముంబై నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌కు సముద్ర మార్గంలో, అక్కడి నుంచి రష్యాకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరతాయి. ఈ మార్గం సుయెజ్ కాలువపై ఆధారపడకుండా, రవాణా సమయాన్ని 40% తగ్గిస్తుంది, ఖర్చును 30% తగ్గిస్తుంది.
ఈ కారిడార్‌లో చాబహార్ పోర్ట్ ఒక కీలక భాగం. ఈ పోర్ట్ ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకుంటోంది. ఉదాహరణకు, 2017లో భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు గోధుమలు చాబహార్ పోర్ట్ నుంచే పంపించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం

ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఈ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేసే అవకాశం ఉందంటున్నారు. ఇది ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా అయ్యే మార్గం. భారత్ తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. ఈ జలసంధి మూసుకుపోతే, ఆయిల్ రేట్లు 7-9% పెరుగుతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చాబహార్ పోర్ట్, INSTCపైనా ప్రభావం చూపవచ్చు. ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఇరాన్ ఓడరేవులపై డైరెక్ట్ గా దాడి చేయలేదు, కానీ తీరంలో కొన్ని దాడులు జరిగాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ ఈ యుద్ధం మరింత తీవ్రమైతే, చాబహార్ పోర్ట్ ఆపరేషన్స్‌పై ప్రభావం పడవచ్చు. ఇది భారత్‌కు పెట్టుబడులకు, వాణిజ్య మార్గాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

భారత్ ఎందుకు గమనిస్తోంది?

భారత్ యుద్ధ పరిస్థితిని గమనిస్తోంది. చాబహార్ పోర్ట్ భారత్‌కు కేవలం ఒక వాణిజ్య కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక ఆస్తి. ఈ పోర్ట్ ద్వారా భారత్ పాకిస్తాన్‌ను దాటి, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాతో బిజినెస్ ను పెంచుకుంటోంది. పైగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు ధీటుగా చాబహార్ పోర్ట్ ను ఇండియా అభివృద్ది చేసింది. అయితే భారత్ – ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో, ఇరాన్‌తో చాబహార్ ద్వారా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది. అందుకే భారత్ ఈ రెండు దేశాలతోనూ జాగ్రత్తగా దౌత్య విధానాన్ని మెయింటైన్ చేస్తోంది.

భవిష్యత్తు ఏమిటి?

చాబహార్ పోర్ట్, INSTC ప్రాజెక్ట్‌లు పూర్తిగా అమలైతే, భారత్ వాణిజ్యం ఐరోపా, సెంట్రల్ ఆసియాతో మరింత బలపడుతుంది. అయితే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం లాంటి సవాళ్లు ఈ ప్రాజెక్ట్‌లను ప్రభావితం చేసే అవకాశముంది. భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొని, తన దౌత్య నైపుణ్యం ప్రదర్శించి ఈ ప్రాజెక్ట్‌లను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Also read: కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ సీటుపై లొల్లి

Also read: పావలా కోడికి బారాన మసాలా అంటే ఇదే !

Also read: మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?

Also read: https://timesofindia.indiatimes.com/business/india-business/iran-israel-conflict-india-keeping-tab-on-chabahar-port-international-north-south-transport-corridor-why-its-important/articleshow/121970531.cms

Tagged