Karthika deepam Karthika deepam

కార్తీక మాసంలో ఏ రోజు ఏం చేయాలి ? తిధుల వారీగా ఇలా చేశారంటే… !

Devotional

కార్తీక మాసంలో ఒక రోజు మంచిది అని ఏమీ లేదు… ప్రతి రోజూ మంచిదే అంటారు.  అంతే కాదు… ప్రతి తిధికీ ఒక్కో ప్రాధాన్యత ఉంది.  శివ కేశవులను  ప్రసన్నం చేసుకోడానికి మనం ఈ కార్తీక మాసంలో ఏ రోజు ఏం చేయాలి… ఏ తిధి నాడు ఏమి పాటిస్తే పుణ్యం దక్కుతుంది…ఆ శివ కేశవుల ఆశీర్వాదాలు దక్కుతాయి అన్నది చూద్దాం.

 

Karthika Masam : కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో  శ్రీ మహావిష్ణువును (God Vishnu) తులసీ దళాలతో, కమలాలతో పూజిస్తే మనం జీవించి ఉన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి,  సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రినాడు, సోమవారం, కార్తీక పౌర్ణమి (Karthika pournami) రోజుల్లో శివుడికి రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలు, రుద్రాక్షలతో పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు శివసాయుజ్యం పొందే అవకాశం ఏర్పడుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.

తిధుల వారీగా ఇలా చేశారంటే…

కార్తీక శుద్ధపాడ్యమి:– తెల్లవారు జామునే లేచి… స్నానం చేసి, దగ్గర్లో ఉన్న ఏదైనా ఆలయాని వెళ్ళి , నేను చేయాలనుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ఆ దేవుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని ఆ ఆలయంలో ఏర్పాటు చేసిన ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ:- ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేత్తో భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

తదియ:– అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల మహిళలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది.

చవితి:– కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి ‘పుట్టకు’ పూజ చేయాలి. పాలు పోయాలి.

పంచమి:–  జ్ఞానపంచమి అని కూడా అంటారు. పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.

షష్టి:-  బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

సప్తమి:- ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుందని అంటున్నారు.

అష్టమి:– ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజతో విశేష ఫలితాలు ఉంటాయి.

నవమి:– నవమి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. శ్రీమహావిష్ణువు కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి.

దశమి:– ఇవాళ రాత్రి విష్ణుపూజ చేయాలి.

ఏకాదశి:- ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఇవాళ విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.

ద్వాదశి:– ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల దగ్గర దామోదరుడు (శ్రీమహావిష్ణువు)ను  ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం వల్ల మనకు తెలిసో తెలియకో చేసిన సర్వపాపాలూ నశించిపోతాయి.

త్రయోదశి:– ఇవాళ సాల గ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి. సుఖ సంతోషాలు కలుగుతాయి.

చతుర్దశి:– పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకుంటే మంచిదని పెద్దలు చెబుతున్నారు.

కార్తీక పూర్ణిమ:– కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది… ఇవాళ మహా పవిత్రమైన రోజు.  నదీస్నానం చేసి శివాలయం దగ్గర జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.

కార్తీక బహుళ పాడ్యమి:– ఇవాళ ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

కార్తీక విదియ:– విదయ నాడు వన భోజనం చేయడం విశేష ఫలాలను ఇస్తుంది.

తదియ:- పండితులు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. జ్ఞానం సమకూరుతుంది.

చవితి:– పగలంతా ఉపవాసం చేసి… సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను దిండుత కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయంటారు పెద్దలు.

పంచమి:– చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం లాంటి జంతు సేవలతో శుభ ఫలితాలు ఉంటాయి.

షష్ఠి:- గ్రామ దేవతలకు పూజ చేయడం మంచిది.

సప్తమి:– జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సకల సంపదలు కలుగుతాయని చెబుతారు.

అష్టమి:- కాలభైరవాష్టకం చదువుకోవాలి.  గారెలతో దండచేసి, కాల భైరవానికి ( కుక్కకు ) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి:– వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.

దశమి:- దశమి నాడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు దగ్గరవుతారు.  మీ కోరికలు తీరతాయంటున్నారు పెద్దలు.

ఏకాదశి :– ఏకాదశి నాడు విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలలాను కలిగిస్తుంది. ద్వాదశి :- అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.

త్రయోదశి :– నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.

చతుర్దశి :– ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయని పండితులు చెబుతున్నారు.

అమావాస్య :– అమావాస్య నాడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా పేదవారికి స్వయం పాకం దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి.

కార్తీకమాసంలో అన్నీ మంచి రోజులే

ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. రోజూ చేయడానికి శక్తి లేని వారు… కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, కార్తీక సోమవారాల్లో లేదా ఒక్క పౌర్ణిమ రోజు లేదా ఒక్క సోమవారం రోజైనా సరే…. నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యఫలం దక్కుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి. అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు , ఇతివృత్తాలు, ఉపకథలు తెలియజేస్తున్నాయి. ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం , సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం చేసుకునే ముఖ్యమైన వ్రతాలు.

Tagged