Bangladesh : పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్… ఇస్లాం రాజ్యం అవుతుందా?

Latest Posts NRI Times Top Stories

భారత్ పక్కన మరో బల్లెం తయారవుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ (Pakistan) తో వేగలేక చస్తుంటే… ఇప్పుడు బంగ్లాదేశ్  (Bangladesh )కూడా అలాగే తయారవుతోంది. పాకిస్తాన్ తో దోస్తీ చేస్తోంది. ఒకప్పుడు భారత్ కు అనుకూలంగా ఉన్న ఈ దేశం… షేక్ హసీనా రాజీనామా తర్వాత పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్  కార్గో షిప్ ప్రస్తుతం చిట్టగాంగ్ పోర్టులో లంగర్ వేయడం భారత్ కు ఆందోళన కలిగించే అంశం. 

1971లో పాకిస్తాన్ తో విడిపోయి బంగ్లాదేశ్ గా అవతరించడంలో మన దేశం ప్రమేయం చాలా ఉంది. అందుకే మొన్నటిదాకా ఆ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన షేక్ హసీనా (Shaik Hasina) పూర్తిగా భారత్ అనుకూల వైఖరి అవలంభించారు. కానీ స్టూడెంట్స్ ఉద్యమం తర్వాత హసీనా రాజీనామా చేసి భారత్ కు పారిపోయి వచ్చారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ – బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతుండటం భారత్ కు ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి ఓ నౌక బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ చేరుకోవడం ఇదే మొదటిసారి. కొత్తగా రవాణా మార్గం ఏర్పడింది… కొత్తగా రవాణా సదుపాయాలు పెరుగుతాయి అంటూ పాకిస్తాన్ హైకమిషన్ ప్రకటన కూడా చేసింది.

యూనస్ – షాబాజ్ షరీఫ్ చర్చలు

గత సెప్టెంబర్ లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్ లో రెండు దేశాల అధినేతల సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్నారు. వచ్చే ఏడాది రెండు దేశాల విదేశాంగ మంత్రులు కూడా భేటీ అవుతారట. ఇప్పుడు పాక్ నౌక బంగ్లాదేశ్ కి రావడమే కాదు… 2025లో జరిగే నౌకాదళ విన్యాసాల్లో పాల్గొంటున్నట్టు బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ పౌరులకు ఉచిత వీసాలు ఇస్తున్నట్టు కూడా పాకిస్తాన్ ప్రకటించింది.

ఇస్లాం దేశంగా బంగ్లాదేశ్

Bangladesh

బంగ్లాదేశ్ ను క్రమంగా ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఆ దేశ రాజ్యాంగం నుంచి లౌకిక వాదం, సామ్యవాదం అనే రెండు పదాలు తొలగించాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. అంతేకాదు… బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన షేక్ ముజీబుర్ రెహ్మాన్ (హసీనా తండ్రి)కి ఉన్న జాతిపిత హోదాను తొలగించాలని కూడా పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ అటార్నీ జనరల్ తాము పిటిషనర్ల వాదనలను సమర్థిస్తున్నామని కోర్టుకు చెప్పారు. 2011లో షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు చేర్చారు. ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ అటార్నీ జనరల్ వాదించారు. దాంతో కోర్టు తీర్పుతో ఇక బంగ్లాదేశ్ లో లౌకికానికి స్థానం లేకుండా పోతుందేమో. అప్పుడు అక్కడ నివసిస్తున్న లక్షల మంది హిందువుల (Hindus) హక్కుల పరిస్థితి ఏంటి ? ఇప్పటికే చాలామటుకు ఆలయాలు ధ్వంసం అయ్యాయి. హిందూ టీచర్లు, ఉద్యోగులను బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు పూర్తిగా ఇస్లాం దేశంగా మారితే… పాకిస్తాన్ లో హిందువులు ఎంత దుర్భరంగా జీవిస్తున్నారో అలాంటి పరిస్థితులే బంగ్లాదేశ్ లోనూ తలెత్తుతాయి.

 

ఇది కూడా చదవండిDaku Maharaj : బాలయ్య మూవీ…. డాకు మహారాజ్ ఎవరు ?

బంగ్లా – పాక్ ఫ్రెండ్షిప్ – భారత్ కు ఇబ్బందే !

ఈ రెండు పొరుగు దేశాల మధ్య స్నేహం… వీళ్ళకి చైనా సపోర్ట్ చేయడం… ఈ వ్యవహారమంతా మొత్తం దక్షిణాసియా మీదే ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. యూనస్ బంగ్లాదేశ్ కి నామమాత్రపు అధిపతే. మొత్తం దేశమంతా క్రమంగా ఇస్లాంవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వస్తుండటంతో బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారతాయని షేక్ హసీనా ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ కి బంగ్లాదేశ్ ప్రధాని హోదాలోనే ఆమె శుభాకాంక్షలు తెలిపారు. బైడెన్ (Byden) ప్రభుత్వం తమ భూభాగంలో ఓ దీవి ఇవ్వలేదని … కుట్ర చేసి తన ప్రభుత్వాన్ని కూలదోసిందని షేక్ హసీనా ఆరోపించారు.

ట్రంప్ వస్తే మారుతుందా ?

జనవరిలో అమెరికాలో ప్రభుత్వం మారుతోంది. USA అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అప్పుడు దక్షిణాసియాలో రాజకీయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ట్రంప్ పాకిస్తాన్ ని గట్టిగా వ్యతిరేకించారు. ఓ వైపు అమెరికా నుంచి భారీగా నిధులు పొందుతూ… మరోవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తుండటం ట్రంప్ కి నచ్చలేదు. అటు చైనా (China) పైనా ఆర్థిక ఆంక్షలు అమలు చేశారు. అందువల్ల బంగ్లాదేశ్ తో దోస్తీ చేస్తే ట్రంప్ ఊరుకుంటారా అన్నది డౌట్ గా మారింది. ఏదేమైనా పాక్ – బంగ్లా ఫ్రెండ్షిప్ మాత్రం భారత్ కు రాబోయే రోజుల్లో ఇబ్బంది కలిగించే అంశమే.

Tagged